టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక

May 19 2026 4:50 AM | Updated on May 19 2026 4:50 AM

చిత్తూరు కార్పొరేషన్‌: నగరంలోని 3వ డివిజన్‌ దొడ్డిపల్లికి చెందిన టీడీపీ నాయకుడు ఉదయచంద్రన్‌ వైఎస్సార్‌సీపీలో చేరారు. సోమవారం చిత్తూరులో వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆయనకు పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

రాకపోకలు బంద్‌

కుప్పం రూరల్‌ : మండలంలోని డీకేపల్లి వద్ద ఉన్న రైల్వే అండర్‌ బ్రిడ్జి (ఆర్వోబీ)లో చిన్నపాటి వర్షానికే పెద్ద ఎత్తున నీరు నిలిచిపోతోంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఆదివారం కురిసిన వర్షానికి బ్రిడ్జి సగానికి పైగా నీరు నిలిచిపోయింది. రాత్రి 10 నుంచి ఉదయం 10 గంటల వరకు ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విధిలేని పరిస్థితుల్లో గుడ్లనాయనపల్లి, క్రిష్ణదాసనపల్లి, పరసముద్రం, మోడల్‌ కాలనీ, అమరావతి కాలనీ ప్రజలు 3 కి.మీ దూరం చుట్టుకుని పెద్దపల్లి గంగమ్మ ఆలయం వద్ద ఉన్న మరో ఆర్వోబీ గుండా రాకపోకలు సాగించాల్సి వచ్చింది. అక్కడ కూడా రెండు అడుగులకు పైగా నీరు చేరడంతో స్థానికులు సతమతమయ్యారు. సోమవారం కూడా డీకేపల్లి బ్రిడ్జి వద్ద పూర్తి స్థాయిలో నీటిని తొలగించలేదు. వాహనదారులు వర్షపు నీటిలోనే రాకపోకలు సాగించారు.

అండర్‌ బ్రిడ్జిలో ఆగిపోయిన బస్సు

డీకే పల్లి వద్ద ఉన్న అండర్‌ బ్రిడ్జిలో సగానికి పైగా నీరు చేరడంతో సోమ వారం ఉదయం ఆ మార్గం గుండా వెళుతున్న వేపనపల్లి బస్సు సగానికి పైగా మునిగిపోయి ఆగిపోయింది. డ్రైవర్‌ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

సీఎం పర్యటనకు పటిష్ట భద్రత

కుప్పం: జాతర నేపథ్యంలో సీఎం చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనకు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎస్పీ తుషార్‌డూడి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు శాంతిపురం మండలం, కడపల్లి వద్దతున్న ఇంటి నుంచి పట్టణంలోని గంగమ్మ దేవాలయానికి వచ్చి అమ్మవారికి సారే సమర్పించనున్నట్టు తెలిపారు. వారి వెంట ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, డీఎస్సీ పార్థసారథి, ఆర్డిఓ బాగ్యలక్ష్మి, కడా ఏపీడీ శ్రీనివాసులు రాజు, రూరల్‌ సీఐ మల్లేష్‌యాదవ్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement