చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి 40 ఫిర్యాదులు అందినట్టు చిత్తూరు డీఎస్పీ వెంకట నారాయణ తెలిపారు. ఈ మేరకు ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్‌లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
రేపు కుప్పానికి సీఎం
– ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
కుప్పం: కుప్పం జాతరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. ఈ నేప థ్యంలో ఆయన పర్యటించే ప్రదేశాలను సోమ వారం కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ తుషార్‌డూడి పరిశీలించారు. సీఎం బుధవారం ఉద యం 11 గంటలకు శాంతిపురం మండలం తుమ్మిసి వద్ద హెలిప్యాడ్‌కు చేరుకుని, అక్కడి నుంచి కడపల్లి వద్ద ఉన్న స్వగృహానికి వెళ్లనున్నారు. అక్కడి నుంచి కుప్పం పట్టణంలో జరుగుతున్న తిరుపతి గంగమ్మ విశ్వరూప దర్శనానికి హాజరు కానున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం తుమ్మిసి హెలిప్యాడ్ నుంచి బెంగళూరు చేరుకుని, అక్కడి నుంచి విజయవాడకు తిరుగు ప్రయాణం కానున్నట్టు అధికారులు తెలిపారు.
ఉన్నతాశయంతో
ముందుకు సాగాలి
చిత్తూరు కలెక్టరేట్ : ప్రతి విద్యార్థి ఉన్నతాశయంతో ముందుకు సాగాలని డీఈవో రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని గిరింపేట హైస్కూల్‌లో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చలపతి, మండల అధ్యక్షురాలు లత, ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబు సంయుక్త ఆధ్వర్యంలో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడం విద్యార్థి జీవితంలో తొలి మెట్టు ఎక్కినట్లుగా భావించాలని తెలిపారు. అనంతరం చిత్తూరు అర్బన్ పరిధిలోని 25 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించి, ప్రశంసాపత్రాలను అందజేశారు. చిత్తూరు ఎంఈవో సెల్వరాజ్, గుడిపాల ఎంఈవో హసన్‌బాషా, ఏపీటీఎఫ్ ఉపాధ్యక్షులు వరదరాజులు పాల్గొన్నారు.
డయల్ యువర్ ఎస్‌ఈకి ఐదు సమస్యలు
చిత్తూరు కార్పొరేషన్: నగరంలోని విద్యుత్ ఎస్‌ఈ కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఐదు సమస్యలు వచ్చినట్టు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. ఇందులో గంగవరం మండలం నుంచి అనధికారికంగా వినియోగిస్తున్న సర్వీసు పై సుబ్రమణ్యం, చిత్తూరు కట్టమంచిలో బ్రేక్‌డౌన్‌లు తగ్గించాలని దామోదార్‌రెడ్డి, మురకంబట్టులో లూజ్‌లైన్ సరిచేయాలని వినాయకం ఫిర్యాదు చేశారు. వెదురుకుప్పం, యాదమరిలో ఏడాది కాలంగా వ్యవసాయ సర్వీసు కోసం వేచిచూస్తున్నామని పట్టాభి, చిట్టెమ్మ ఎస్‌ఐ దృష్టికి తెచ్చారు.
నేడు కరెంటోళ్ల జనబాట
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను నమోదు చేసుకుంటారని ఆయన వెల్లడించారు.


