చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా పశుసంవర్థక శాఖలో నియామకాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆ శాఖలో పనిచేస్తున్న సహాయకుల(ఏహెచ్‌ఏ) నియామకాలలో వెయిటేజ్ మార్కులు పొందిన సుమారు 50 మందికి తాజాగా షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఒకవైపు శాఖలో విధులు నిర్వహిస్తూ పారితోషికం పొందిన అభ్యర్థులు, అదే సమయంలో కళాశాలల్లో చదివి విద్యార్హతలు సాధించినట్లు రికార్డులు చూపుతున్న నేపథ్యంలో అధికారులు వివరణ కోరారు.
వెయిటేజ్ మార్కులే కేంద్ర బిందువు
సహాయకుల నియామకాల సమయంలో పశుసంవర్థక శాఖలో హాస్పిటల్ అటెండెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అటెండెంట్, గోపాలమిత్రగా పనిచేసిన వారికి అదనపు వెయిటేజ్ మార్కులు మంజూరు చేశారు. ఈ మార్కులు అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించాయి. అయితే ఇటీవల నిర్వహించిన రికార్డుల పరిశీలనలో కొందరి విద్యార్హతల ధ్రువీకరణలో వ్యత్యాసాలు బయటపడ్డాయి. ఆ శాఖ రికార్డుల ప్రకారం సంబంధిత అభ్యర్థులు విధులు నిర్వహిస్తూ ఆ శాఖ నుంచి పారితోషికం పొందిన కాలంలోనే రెగ్యులర్ కోర్సు లు పూర్తి చేసినట్లు గుర్తించారు. దీంతో ‘ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ కళాశాలకు ఎలా హాజరయ్యారు?’, ‘చదువు కోసం అధికారుల అనుమతి తీసుకున్నారా?’ అనే ప్రశ్నలు తలెత్తాయి. సంబంధిత 50 (సుమారు) మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన అధికారులు, మూడు రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. చదువు విధానం, కళాశాల హాజరు, సెలవుల వినియోగం, సంబంధిత అధికారుల అనుమతులు వంటి వివరాలను ఆధారాలతో సమర్పించాలని స్పష్టం చేశారు.
కలకలం
నోటీసుల జారీతో పశుసంవర్థక శాఖలో తీవ్ర చర్చ మొదలైంది. వెయిటేజ్ మార్కుల ఆధారంగా ఉద్యోగాలు పొందిన వారిపై విచారణ చేపట్టే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరికొందరి రికార్డులను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. సంబంధిత సిబ్బంది ఇచ్చే వివరణల ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశముందని ఆ శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. అవసరమైతే నియామక ప్రక్రియ, వెయిటేజ్ మార్కుల మంజూరు, విద్యార్హత చెల్లుబాటు అంశాలపై లోతైన విచారణ చేపట్టే అవకాశముందని సమాచారం.


