వెదురుకుప్పం: విద్య, వైద్య రంగాలపై కూటమి ప్రభుత్వ శీతకన్ను వేసిందని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆరోపించారు. ఎంపీపీ నాగరాణి భర్త వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు బండి హేమసుందర్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా సోమవారం గంటావారిపల్లె సమీపంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఆత్మీయ సమావేశం నిర్వహించి, ఇటీవల టెన్త్ ఫలితాల్లో టాపర్లుగా నిలిచిన వారికి ఆర్థిక సాయంతో పాటు ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు ఉచిత విద్య, నాణ్యమైన వైద్యం అందకుండా చేసినట్లు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జగనన్న హయాంలో పేదలకు ఇంగ్లిషు మీడియంలో ఉచిత విద్య, కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన వైద్యం అందించారని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు ప్రైవేటు మోజులో పడి ప్రభుత్వ రంగ స్థంస్థలను ప్రైవేటు పరం చేస్తూ పేదలకడుపుకొడుతున్నట్లు ఆరోపించారు. ఒక్క సారి ముఖ్యమంత్రి అయిన జగన్ రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పేద వర్గాలకు గుర్తుండేలా ఏం చేశారని ప్రశ్నించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు సుకుమార్, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు పద్మనాభరెడ్డి(వెదురుకుప్పం), వెంకటరెడ్డి(గంగాధరనెల్లూరు), విజయకుమార్(పెనుమూరు), మణి(శ్రీరంగరాజపురం), మాజీ జెడ్పీటీసీ మాధవరావు, యువత మండల అధ్యక్షుడు గణపతిరెడ్డి, షణ్ముగెడ్డి, పరం ధామరెడ్డి, మార్కొండారెడ్డి పాల్గొన్నారు.
టెన్త్ టాపర్‌ని సత్కరిస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, దాత హేమసుందర్
హేమసుందర్‌రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న నారాయణస్వామి


