చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో డివిజన్ల సరి హద్దులు మారాయి. ఇప్పటి వరకు ఉన్న డివిజన్ల స్థానంలో అదనంగా మరో పది డివిజన్లు వచ్చి చేరాయి. దీంతో నగరంలో డివిజన్ల సంఖ్య 60కి చేరింది. సోమవారం చిత్తూరు మునిసిపల్ కమిషనర్ నరసింహప్రసాద్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుల చేశారు.
ఇలా విభజన
కార్పొరేషన్లలో ఇప్పటి వరకు ఉన్న డివిజన్ల సంఖ్యను 60కు పెంచాలని ఇటీవల రాష్ట్ర మునిసిపల్ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో చిత్తూరులో వార్డుల పునర్విభజనపై కసరత్తు ప్రారంభించిన అధికారులు ప్రాథమిక సరిహద్దులు నిర్ణయిస్తూ 60 డివిజన్లను రూపొందించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం చిత్తూరులో 1,89,332 మంది ఉండగా.. దీన్ని 60 డివిజన్లకు సరిపడా జనాభాతో విభజించారు. అంటే సగటున ఒక్కో డివిజన్‌లో 3,150 మంది ఉండేలా చూసుకున్నారు. ఇందులో 10 శాతం తక్కువ, ఎక్కువ ఉండొచ్చు. 1వ డివిజన్ మురకంబట్టులో ప్రారంభించి సవ్య దిశలో మ్యాప్‌ను రూపొందించిన అధికారులు 60వ డివిజన్‌ను తిమ్మసముద్రం వద్ద ముగించారు.
అభ్యంతరాలు తెలియజేయొచ్చు
వార్డుల పునర్విభజన జాబితాను అధికారులు మునిసిపల్ కార్యాలయం, తాహసీల్దారు కార్యాలయం, కలెక్టరేట్, ఆర్డీవో, బస్టాండు, తపాలాశాఖ తదితర ప్రాంతాల్లో ఉంచారు. వీటిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 24వ తేదీ వరకు రాత పూర్వకంగా కమిషనర్‌కు తెలియవచ్చు. వచ్చే నెల 24–26 తేదీల్లో వీటిని ఎన్నికల వార్డులుగా ఖరారు చేయనున్నారు.


