నగరి : తడుకు, తడుకు దళితవాడ, సుందరమ్మకండ్రిగ గ్రామాల సమీపంలో ఇప్పటికే పలు క్వారీలకు అనుమతులిచ్చేశారు. అది చాలక మళ్లీ కొత్త క్వారీలకు అనుమతులిస్తున్నారు. క్వారీలతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. గ్రామాల్లో ఉండాలా.. ఊళ్లు వదిలి వెళ్లాలా..?’ అని తడుకు, సుందరమ్మకండ్రిగ గ్రామస్తులు, వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు ప్రశ్నించారు. సోమవారం ఎంపీపీ భార్గవి, వైస్ ఎంపీపీ కన్నియప్ప, వైఎస్సార్‌సీపీ పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు రమేష్‌రెడ్డి, తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి ఆర్డీఓ అనుపమకు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ తడుకు గ్రామ సర్వే నం.85/1లో 6.514 హెక్టార్లు, సర్వే నం.57లో 4.844 హెక్టార్లు, సర్వే నం.100లో 4.996 హెక్టార్లు ముకుంద మైన్ వారికి అప్పగించారన్నారు. అలాగే సర్వే నం.57, 102లో 5.616 హెక్టార్లు దీక్ష మైనింగ్ అండ్ మినరల్స్ వారికి, సర్వే నం.85/4, 85/7లో 5 హెక్టార్లు, సర్వే నం.85లో 8 హెక్టార్లు జీఎం ఇన్ఫ్రా వారికి మొరం, గ్రావెల్, రోడ్ మెటల్, బల్లాస్ట్, బోల్డర్స్ తీసుకునేందుకు కొత్తగా అనుమతులిచ్చారని పేర్కొన్నారు. గ్రామ సభ పెట్టకుండానే ఈ అనుమతులు ఎలా ఇచ్చారని నిలదీశారు. ఉన్న క్వారీలకు తోడు కొత్త క్వారీలు కూడా కొనసాగితే సమీపంగా ఉన్న తడుకు దళితవాడ, జగనన్న కాలనీ, సుందరమ్మకండ్రిగ గ్రామాలు ఖాళీ చేసుకొని వెళ్లాల్సిందేనన్నారు. జనం గ్రామాల్లో ఉండాలో, ఖాళీ చేసుకొని వెళ్లాలో అధికారులే నిర్ణయం తీసుకోవాలన్నారు. దీనిపై ఆర్డీవో మాట్లాడుతూ తప్పక అర్జీలో పేర్కొన్న అంశాలపై విచారణ చేపట్టి న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. మాజీ కౌన్సిలర్ యాకోబు, మహిళా నాయకురాలు తేన్‌మొళి, తడుకు, తడుకు దళితవాడ, సుందరమ్మకండ్రిగ గ్రామస్తులు పాల్గొన్నారు.


