రైతులపై విత్తన భారం | - | Sakshi
Sakshi News home page

రైతులపై విత్తన భారం

May 18 2026 6:33 AM | Updated on May 18 2026 6:33 AM

కిలోపై రూ.5.20 పెంపు.. బస్తాపై రూ.162 పెరుగుదల రైతులపై రూ.1.30 కోట్ల భారం జిల్లాకు 27 వేల క్వింటాళ్ల కేటాయింపు త్వరలో పంపిణీ చేయనున్న అధికారులు

కూటమి ప్రభుత్వం రైతులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. ఇప్పటికే ఎరువులు, పురుగు మందుల భారం మోపింది. తాజాగా వేరుశనగ విత్తన కాయల ధరలు పెంచి నడ్డి విరుస్తోంది. రాయితీ ఇస్తున్నామని చెబుతూ రైతుల జేబులకు చిల్లు పెడుతోంది. గత ఏడాదితో పోలిస్తే 30 కిలోల వేరుశనగ కాయల బస్తాపై రూ.162లు పెంచింది. ఆ లెక్కన జిల్లాలోని రైతులపై మొత్తం రూ.1.30 కోట్ల అదనపు భారం పడుతోందని రైతు సంఘం నాయకులు చెబుతున్నారు.

కాణిపాకం: జిల్లాలో ఖరీఫ్‌–2026 సీజన్‌ ప్రారంభమైంది. ఇటీవల అడపాదడపా కురుస్తున్న వర్షాలకు రైతులు పొలాలను దుక్కిదున్నుకున్నారు. ప్రభుత్వం వేరుశనగ విత్తన కాయలు ఇస్తే వాటిని వలుచుకుని తొలకరి వర్షం కురిసిన వెంటనే విత్తేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ జిల్లాకు 27,225.9 క్వింటాళ్ల వేరుశనగ విత్తన కాయలను కేటాయించింది. వీటితో పాటు భూసారాన్ని మెరుగుపరిచే పచ్చిరొట్ట విత్తనాలను కూడా రాయితీపై ఇస్తామని అధికారులు చెబుతున్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా త్వరలో పంపిణీ ప్రారంభం కానుందని పేర్కొంటున్నారు. పచ్చిరొట్ట విత్తనాలను భూసార పరిరక్షణ దష్ట్యా రైతులకు 50 శాతం రాయితీపై అందించనున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీ వెల్లడించారు.

బస్తాపై రూ.162 పెంపు..

గత ఖరీఫ్‌ సీజన్‌లో ప్రభుత్వం 30 కిలోల వేరుశనగ విత్తనకాయల బస్తాను రైతులకు రూ.1,674లకు అందజేసింది. ఈ సారి రూ.1,836లకు పెంచింది. అంటే బస్తాపై రూ.162 అదనంగా రైతు చెల్లించాల్సి వస్తోంది. కిలోకు సుమారు రూ.5.20 మేర ధర పెరిగింది. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 31 వేల హెక్టార్లు కాగా గతేడాది 7 వేల హెక్టార్లల్లో మాత్రమే వేరుశనగ సాగైంది. ఈ సారి విత్తన ధర పెంపు, పెట్టుబడి సాయం జాప్యంతో ఖరీఫ్‌ కాడె కదిలే పరిస్థితి కనిపించడంలేదు. సాగు విస్తీర్ణం 4 హెక్టార్ల నుంచి 5 వేల హెక్టార్లకు పరిమితం కావచ్చని రైతులు చెబుతున్నారు.

వేరుశనగ విత్తనాల ధరలు

కే–6, టీసీజీఎస్‌–1694 రకాల విత్తనాల క్వింటాలు ధర రూ.10,200గా ఖరారు చేశారు. అందులో 40 శాతం రాయితీ రూ.4,080 పోగా రైతు వాటా రూ.6,120లుగా నిర్ణయించారు. ఈ లెక్కన 30 కిలోల బస్తా రైతులకు రూ.1,836 పడుతుంది. నారాయణి రకం విత్తనం క్వింటాలు ధర రూ.10,500గా నిర్ణయించారు. అందులో రూ.4,200 రాయితీ పోనూ రైతు వాటా రూ.6,300. లేపాక్షి రకం 30 కిలోల విత్తన బస్తా ధరను రూ.1,710గా ఖరారు చేశారు. రాయితీ ఉన్నప్పటికీ రైతులు చెల్లించాల్సిన మొత్తాలు ఎక్కువగానే ఉండడంతో అసంతప్తి వ్యక్తమవుతోంది. వర్షాలపై అనిశ్చితి ఒకవైపు, పెట్టుబడుల పెరుగుదల మరోవైపు రైతులను తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురిచేస్తోంది. కొన్నేళ్లుగా సాగు ఖర్చులు పెరుగుతున్నా దిగుబడులు ఆశించిన స్థాయిలో రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విత్తనాల కేటాయింపు క్వింటాళ్లలో

వేరుశనగ 27,225.9

జీలుగ 337

జనుము 1005

పిల్లిపెసర 22

Advertisement
 
Advertisement
Advertisement