టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 25వ తేదీ నుంచి జూన్ 4 వరకు పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 32 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేసినట్టు పేర్కొన్నారు. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం పరీక్షలు మాత్రం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు ఉంటాయన్నారు. ఈ నెల 25న మొదటి భాష, కాంపోజిట్ కోర్సు, 26న హిందీ, 28న ఇంగ్లీష్, 30న భౌతిక శాస్త్రం, జూన్ 1న జీవశాస్త్రం, జూన్ 2న సామాజిక శాస్త్రం, జూన్ 3, 4 తేదీల్లో కాంపోజిట్ కోర్సు పేపర్ 2, ఓఎస్‌ఎస్‌సీ ప్రధాన భాష పేపర్లు ఉంటాయని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష ప్రారంభ సమయానికి కనీ సం అరగంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలన్నారు. హాల్ టికెట్ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలన్నారు. మొబైల్ ఫోన్లతోపాటు ఎలక్ట్రానిక్ వస్తువులను కేంద్రంలోనికి అనుమతించబోమని డీఈవో స్పష్టం చేశారు.
విద్యుత్ సమస్యల
పరిష్కారానికి చర్యలు
చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ శాఖ అధికారులు శుక్రవారం చిత్తూరు జిల్లాలో కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో పర్యటించి సమస్యలను గుర్తించారు. 11 కేవీ ఫీడర్ల పరంగా 34 సమస్యలు, ఎల్‌టీ లైన్ల పరంగా 28, సర్వీసు లైన్ 1 మొత్తం 62 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. వాటిలో 3 సమస్యలను పరిష్కారించామన్నారు. మిగిలిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు.


