చిత్తూరు కలెక్టరేట్ : క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి కమిటీ (దిశా) సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చెరువుల పునరుద్ధరణకు ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో సుమారు 3,100 చెరువుల ఫీడర్ చానల్స్ శుభ్రపరిచే పనులపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. గత ఏడాది వర్షాలు పడినప్పటికీ 1,200 చెరువులు నిండలేదన్నారు. ఈ ఏడాది పూడికతీత పనుల చేపట్టి చెరువులు పూర్తి స్థాయిలో నిండేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పీఎం ఆదర్శ గ్రామ యోజన పథకంలో జిల్లాలో మొదటి దశలో 66 ఎస్సీ గ్రామాలను ఎంపిక చేసి 437 పనులకు ఆమోదం తెలిపామన్నారు. ప్రతి ఎస్‌సీ కాలనీకి దాదాపు రూ.20 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఇప్పటికే 342 పనులకు రూ.5 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
వ్యత్యాసాలొద్దు
ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా అధికారులు క్షేత్ర స్థాయిలో సమగ్ర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 70 సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సకాలంలో అందేలా శ్రద్ద వహించాలన్నారు. ఐసీడీఎస్ శాఖలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలన్నారు.


