చిత్తూరు అర్బన్: చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని మెప్మా విభాగంలో పనిచేస్తున్న దళిత రిసోర్స్‌పర్సన్ (ఆర్‌పీ) కవితపై టీడీపీకి చెందిన ఒక మూక దాడికి పాల్పడింది. మౌలి, జగన్, శ్రీనివాసులు, యమున, రేఖతో పాటు 30 మంది వరకు కవితపై భౌతికంగా దాడి చేశారు. ఆమె దళితురాలు అని తెలిసినా కూడా.. రేఖ అనే మహిళ కాళ్లు పట్టుకోవాలని అందరి ఎదుట అవమానించింది. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కార్పొరేషన్ కార్యాలయంలో ఘటన జరగడంతో ఇక్కడి ప్రత్యేకాధికారి, కలెక్టర్ సుమిత్‌కుమార్ సీరియస్ అయ్యారు. కేసు నమోదుకు రెఫర్ చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. అదే సమయంలో ఈ విషయం చిత్తూరు ఎంపీ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు దగ్గుమళ్ల ప్రసాదరావు చెవిలో పడింది. జరిగిన ఘటనకు కాస్త మసాలా అంటించిన ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం.. ఎంపీ వద్ద దీన్ని మరోలా చెప్పినట్లు తెలిసింది. ఎట్టకేలకు గురువారం రాత్రి వన్‌టౌన్ పోలీసులు ఎమ్మెల్యే అనుచరులపై ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ కేసు, ఇతర సెక్షన్లు పెడుతూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీన్ని ఎమ్మెల్యే జీర్ణించుకోలేకపోయారు. తన దృష్టిలో లేకుండా జరిగిన ఘటనను, బాధితురాలికి క్షమాపణ చెప్పి రాజీ చేసుకోమని చెబుతుంటే.. సామాజిక మాధ్యమాల్లో ఏకంగా ఎంపీ పేరిట ప్రకటన వెలువడడంపై మరోవర్గం ఎమ్మెల్యే–ఎంపీ మధ్య నిప్పును రాజేసింది. బాధితురాలికి న్యాయం చేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ, కమిషనర్‌ను ఆదేశించినట్లు ఎంపీ పేరిట ప్రకటన వెలువడడాన్ని ఎమ్మెల్యే అంగీకరించలేకపోయారు. దీంతో శుక్రవారం ఉదయం తనవద్ద ఉన్న ఇద్దరు గన్‌మెన్లను విధులు దిగి వెళ్లిపోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. తనకు ఎలాంటి కోపం లేదని గన్‌మెన్లను పోలీసు శాఖకు సరెండర్ చేశారు. ఇద్దరు గన్‌మెన్లు చిత్తూరు ఆర్ముడు రిజర్వు (ఏఆర్) ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేసి, జరిగిన విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. ఎస్పీ ఆదేశాలతో ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. తనకు ఎవరిపైనా కోపం లేదని, ఇదే సమయంలో తనకు ప్రాణహాని కూడా లేనందున గన్‌మెన్లు అవసరం లేదని గురజాల తేల్చిచెప్పడంతో డీఎస్పీ వెనుదిరిగారు. విషయం సామాజిక మాధ్యమాల్లోకి పాకడం, జిల్లా అధికారుల దృష్టికి, తర్వాత పార్టీ హైకమాండ్‌కు వెళ్లడంతో మరో రెండు రోజుల్లో ఎంపీ–ఎమ్మెల్యే ఇద్దరు తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ మీడియా ముందుకు రావడం.. ఎమ్మెల్యే గన్‌మెన్లను నియమించుకోవడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా ఇన్నాళ్లు తమను గుర్తించడం లేదని, తమకు ప్రాధాన్యత తగ్గిపోయిందని భావిస్తూ వచ్చిన చిత్తూరు టీడీపీలోని ఓ వర్గం.. తాజా ఘటనలను ఎవరికివారు తమకు అనుకూలంగా మలుచుకుని పూర్వవైభవం సాధించామంటూ సంబరాలు చేసుకుంటుండడం కొసమెరుపు.
ఇన్నాళ్లు చాపకింద నీరులా ఉన్న చిత్తూరు నియోజకవర్గ ఎంపీ–ఎమ్మెల్యే మధ్య వైరం ఇపుడు బహిర్గమతమైంది. దీనికి ఒక దళిత మహిళపై ప్రభుత్వ కార్యాలయంలో జరిగిన దాడి ఘటనే కేంద్ర బిందువుగా మారింది. బాధితురాలి పక్షాన ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు నిలబడడం.. తెలియకచేసిన తప్పుకు తన అనుచరులపైనే అట్రాసిటీ కేసు పెట్టిస్తారా..? అంటూ ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ నాయుడు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. అన్నింటినీ దిగమింగుతుంటే తనను చేతగానివాడిగా చూపించేందుకు సొంత పార్టీలోని సీనియర్లు కుట్ర పన్నుతున్నారని గ్రహించి.. బ్రహ్మాస్త్రంగా తన అంగరక్షకులను సరెండర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.


