ఒక కిలో వాట్ సామర్థ్యం ఉన్న సోలార్ రూఫ్ టాప్‌కు రూ.70 వేలు ఖర్చవుతుంది. ముందు సోలార్ ప్యానల్స్ అమర్చి సౌర విద్యుత్ ఉత్పత్తి మొదలైన తర్వాత సబ్సిడీ ఇస్తారు.
రెండు కిలోవాట్స్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి రూ.1.40 లక్షలు, మూడు కిలోవాట్స్‌కు రూ.2.10 లక్షల వరకు ఖర్చువుతోంది.
కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపోను మిగిలిన మొ త్తాన్ని బ్యాంకులు రుణంగా ఇవ్వాల్సి ఉంది. ఆ విధంగా ప్రోత్సాహం లేకపోవడంతో వినియోగదారులు ముందుకు రావడం లేదు.
2024లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అసెంబ్లీలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.20 వేలు రాయితీ ఇస్తామని ప్రకటించారు. క్షేత్రస్థాయి లో అమలుకావడం లేదని తెలుస్తోంది.
మొత్తం విద్యుత్ వినియోగం ఆధారంగా 150 యూనిట్ల లోపు వినియోగం ఉన్నవారికి 1–2 కిలోవాట్స్ ప్యానల్స్, 150–300 యూ నిట్లు వినియోగించే ఇళ్లకు 2–3 కిలోవాట్ల ప్యానల్స్, 300 యూనిట్ల కంటే ఎక్కువ వాడేవారికి 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన రూఫ్‌టాప్ సోలార్ ప్యానల్స్ ఇన్‌స్టాల్ చేస్తున్నారు.
రూ.2 లక్షల విలువైన 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రూ.78 వేలు రాయితీ ఇస్తోంది. వినియోగదారుడి వాటా రూ.21 వేలు పోను మిగిలిన మొత్తానికి ఏడు శాతం తక్కువ వడ్డీతో బ్యాంకు రుణం పొందవచ్చు.
ఈ వ్యవస్థ ద్వారా ఏడాదికి దాదాపు రూ.32 వేలు ఆదా అవుతుంది. గృహ అవసరాలకు వినియోగించుకున్న తర్వాత మిగిలిన సౌర విద్యుత్‌ను గ్రిడ్‌కు ఇవ్వడం ద్వారా యూనిట్‌కు రూ.2.09 ఆదాయం పొందవచ్చు. రుణాన్ని పొందేందుకు బ్యాంకులకు సెక్యూరిటీ కింద ఎటువంటి డ్యాకుమెంట్స్ సమ ర్చించాల్సిన పనిలేదు. కానీ బ్యాంకర్లు అందుకు సహకరించడం లేదు.
రెండేళ్లు గడుస్తున్నా కనిపించని పురోగతి రుణాల మంజూరుకు సహకరించని బ్యాంకర్లు సబ్సిడీ కట్టాల్సిందేని హుకుం ట్రాన్స్‌కో సిబ్బంది చేతివాటం
చిత్తూరులో హిమజ 2 కిలోవాట్ల సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకోవడంతో రూ.60 వేలు సబ్సిడీ పడింది. దీన్ని రుణానికి కట్టాలని బ్యాంకర్లు ఒత్తిడి తెస్తున్నారు. నిబంధనల ప్రకారం కట్టాల్సిన అవసరం లేదు కదా అంటే అదంతా మాకు తెలియదు ముందుగానే చెల్లించాలని పట్టుపడుతున్నారు. ఎన్ని చెప్పినా ససేమిరా సబ్సిడీ కట్టాలని చెప్పడంతో ఏమి చేయాలో తెలియక ఆమె తల పట్టుకుంది.
తిరుపతికి చెందిన శంకర్ తన ఇంటికి 3 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకున్నారు. అందుకు గాను ప్రభుత్వం నుంచి రూ.78 వేలు సబ్సిడీ మొత్తం వారి బ్యాంకు ఖాతాలో జమ అయింది. ఈ విషయం తెలుసుకున్న బ్యాంక్ సిబ్బంది వారి ఇంటికి వచ్చి సబ్సిడీ మొత్తం చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈఎంఐలు సక్రమంగా కడితే చాలు ముందుగా ఎందుకు చెల్లించాలంటే సరైన సమాధానం చెప్పడం లేదు.
చిత్తూరు కార్పొరేషన్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం సూర్యఘర్ పథకం జిల్లాలో పలు కారణాలతో నత్తనడకన సాగుతోంది. సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరులో బ్యాంకర్లు సహకరించడం లేదు. రుణాలు మంజూరు చేసిన కొంతమంది బ్యాంకర్లు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ మొత్తాన్ని ఈఎంఐలకు కట్టాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నారు. దీనికి తోడు ట్రాన్స్‌కో లైన్ ఇన్‌స్పెక్టర్లు, లైన్‌మన్లు మాకు ఏమీ లేదా అని వేలకు వేలు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో మొత్తం విద్యుత్ సర్వీసులు 7,75,963 ఉండగా గృహ సర్వీసులు 5,19,271 ఉన్నాయి. అలాగే తిరుపతి జిల్లాలో మొత్తం 8,57,428 విద్యుత్ సర్వీసులు ఉండగా వాటిలో 6,53,207 గృహ సర్వీలు ఉన్నాయి. మొదటి ప్రాధాన్యత కింద వీరి ద్వారా సౌర విద్యుత్‌ను ప్రోత్సహిస్తూ ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇందుకు బ్యాంకులు సహకరించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇస్తామన్న రూ.20 వేల రాయితీ ఇవ్వకపోవడంతో సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటుకు వినియోగదారులు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
సబ్సిడీ మొత్తం కట్టాల్సిందే..
చిత్తూరు జిల్లాలో సోలార్ ఏర్పాటు కోసం 36,205 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 36,173 దరఖాస్తులు అనుమతులు పొందాయి. వెండర్లకు ఎంపికై నవి దరఖాస్తులు 6,583, సబ్సిడీ వచ్చినవి 1,090, ఏర్పాటు చేసిన మొత్తం కెపాసిటీ సామర్థ్యం 3,270 కిలోవాట్లు. తిరుపతి జిల్లాలో 30,024 దరఖాస్తులు రాగా, 29,990 అనుమతులు పొందాయి. 7,995 దరఖాస్తులను వెండర్లు ఎంపిక చేసుకున్నారు. వీటిలో 2,454 మంది వినియోగదారులకు సబ్సిడీ పడింది. వీటి ద్వారా మొత్తం తయారయ్యే విద్యుత్ 9,460 కిలోవాట్లు.
నగదు ఇవ్వాలని సిబ్బంది డిమాండ్
సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేశాక విద్యుత్ శాఖ సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. పనంతా అయిపోయింది మీటర్ కూడా బిగించేశాం.. లైన్ ఇన్‌స్పెక్టర్ సార్ కూడా వచ్చారు.. తమను గమనించుకోవాలని లైన్‌మెన్లు అడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తర్వాత చూద్దామని వినియోగదారులంటున్న ఎప్పుడు రమ్మంటారని టైమ్ ఫిక్స్ చేసుకుంటున్నారు.
చిత్తూరులో పెట్టిన ఫలకాలు
పీఎం సూర్యఘర్ కరపత్రం
అందని ప్రభుత్వం ప్రోత్సాహం
రోజురోజుకూ విద్యుత్ వినియోగం పెరిగింది. విద్యుత్ లేనిదే ఒక్క పని కూడా జరిగే పరిస్థితి లేదు. ఈ క్రమంలో సంప్రదాయేతర ఇంధన వనరులను వినియోగించుకోవడం ద్వారా భవిష్యత్తులో విద్యుత్ కొరత రాకుండా చూడాలని కేంద్రం భావించింది. ఇందులో భాగంగా సోలార్ విద్యుత్‌ను విరివిగా తయారుచేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తి బిజిలీ యోజన పథకాన్ని తీసుకువచ్చింది. దీనికి ప్రజలకు సబ్సిడీ ఇచ్చి ఇళ్లపై సోలార్ ప్యానళ్లు ఏర్పాటుచేసుకునేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పలు కారణాలతో జిల్లాలో ఈ పథకం అమలు నత్తనడకన సాగుతోంది.


