పైన అమ్మవారు.. కింద కమ్మవారు అన్నట్లు రాజధాని ఏర్పాటా..? రాజధాని భూముల అభివృద్ధి పేరుతో అక్రమాలు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే వైఎస్సార్ సీపీ సిద్ధాంతం మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి
కార్వేటినగరం: చంద్రబాబు నాయుడు తన సొంత ప్రయోజనం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా చీల్చారని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి ఆరోపించారు. ఆయన ఆదివారం పుత్తూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయనున్నట్టు చంద్రబాబునాయుడు ముందుగానే తమ సామాజిక వర్గానికి, టీడీపీ నాయకులకు తెలియజేశారని తెలిపారు. తమ వర్గానికి చెందిన వారు కావాల్సినన్ని భూములను కొనుగోలు చేసిన తర్వాత అసెంబ్లీలో అమరావతి రాజధాని అని ప్రకటించారని విమర్శించారు. అమరావతి ప్రాంతం రాజధానికి అనుకూ లం కాదని శివరామకృష్ణ కమిషన్ నివేదిక ఇచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదన్నారు. విజయవాడ కొండపైన అమ్మవారు.. కొండకింద కమ్మవారు అని ప్రజాప్రతినిధులు మాట్లాడుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రానికి రాజధాని అన్ని వర్గాలకు చెందినదిగా ఉండాలని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే ఉండాలనుకోవడం దారుణమన్నారు.
పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై
స్టే తెచ్చిన ఘనత బాబుది
జగనన్న ప్రభుత్వంలో అర్హులైన పేదవారికి 3 లక్షల ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తే దానిపై కోర్టులో స్టే తెచ్చిన ఘనత చంద్రబాబునాయుడిదన్నారు. రాజధానికి 2 వేల ఎకరాల భూముల అవసరం ఉండగా అనేక వేల ఎకరాలను సేకరిస్తున్నారని దుయ్యబట్టారు. రాజధాని ఏర్పాటుకు దాదాపు రూ.2 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం అప్పులతో కొట్టుమిట్టాడుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మావిగన్ కారిడార్ ఏర్పాటు చేస్తే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలు మరింతగా అభివృద్ధి చెందుతాయని వివరించారని తెలిపారు. రూ.20 వేల కోట్లతో రాజధానిని సులభంగా నిర్మించవచ్చని తెలిపారు. దాన్ని గుర్తించకుండా టీడీపీ నేతలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబునాయుడు ఏటీఎంలా వాడుకున్నాడని ప్రధాని మోదీ తెలియజేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అమరావతిని కూడా అలాగే వాడుకుంటున్నాడని ప్రజలకు అర్థమైందని తెలిపారు. అమరావతిలో రాజధాని భూముల అభివృద్ధి పేరిట అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధే
మా సిద్ధాంతం
వైఎస్సార్ సీపీ అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు. అక్కడ జరుగుతున్న అవినీతిని మాత్ర మే వ్యతిరేకిస్తున్నామన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ సిద్ధాంతమన్నారు. గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం మూడు ప్రాంతాలను కలుపుతూ మావిగన్‌గా ఏర్పాటు చేస్తే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు.


