పరీక్షల నిర్వహణలో రాజీ వద్దు
చిత్తూరు కలెక్టరేట్: పరీక్షల నిర్వహణలో ఎలాంటి రాజీ వద్దని డీఆర్‌ఓ కె.మోహన్‌కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రెగ్యులర్ ఇంటర్, ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. డీఆర్‌ఓ మాట్లాడుతూ జిల్లాలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించబోయే రెగ్యులర్, ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించాలన్నారు. పరీక్షలు అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. రెగ్యులర్ ఇంటర్ పరీక్షలు ఈ నెల 23 వ తేదీ నుంచి మార్చి 24 వ తేదీ వరకు జిల్లాలోని 50 కేంద్రాల్లో నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షలకు 29,279 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. మార్చి 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 13 కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షలకు 1,063 మంది అభ్యర్థులు హాజరవుతారని చెప్పారు. మార్చి 16 వ తేదీ నుంచి మార్చి 28 వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 19 కేంద్రాల్లో ఓపెన్ పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షలకు 2,528 మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు.
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
జిల్లాలోని ప్రతి పరీక్ష కేంద్రం వద్ద కచ్చితంగా 144 సెక్షన్ అమలు చేయాలని డీఆర్‌ఓ ఆదేశించారు. భద్రత, నిఘా పకడ్బందీగా ఉండాలన్నారు. కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్‌లు పరీక్షల సమయంలో మూసివేయాలన్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు కచ్చితంగా పరీక్ష కేంద్రాలకు గంట ముందుగా చేరుకోవాలన్నారు. ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదన్నారు. సెల్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లకు అనుమతి లేదన్నారు.
శాఖల వారీ బాధ్యతలు
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు శాఖల వారీగా బాధ్యతలను అప్పగించారు. పరీక్షల సమయంలో విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం 6 గంటల నుంచే ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని తెలిపారు. సీసీ కెమెరాల పని చేసేందుకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలన్నారు. ప్రతి కేంద్రం వద్ద ఏఎన్‌ఎం, నర్సులను నియమించి, ప్రథమ చికిత్స సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాలలో తాగునీరు, బెంచులు, వెలుతురు వంటి కనీస సౌకర్యాలు ఉండేలా చూడాలని డీఆర్‌ఓ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ డీఐఈఓ రఘుపతి, డీఈఓ రాజేంద్రప్రసాద్, డీఎస్పీ మహబూబ్ బాషా, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


