దాచి పెట్టి దోపిడీ!
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఇసుక దోపిడీలో కూటమి నేతలు పేట్రేగిపోతున్నారు. అక్రమంగా తవ్వకాలు చేసి తెల్లబంగారాన్ని దోచేస్తున్నారు. వంకలో తవ్వకాలు చేసి... ఆపై డప్ చేసి రహదారి కోసమంటూ టిప్పర్లలో తమిళనాడుకు తరలిస్తున్నారు. అక్కడ టిప్పర్ ఇసుక లక్షలకు విక్రయి స్తున్నట్టు తెలుస్తోంది. మూడు రోజులుగా జరుగుతున్న ఈ దందాకు అడ్డుకట్టవేసేందుకు అధికార పార్టీ నాయకులే సిద్ధమవ్వడం గమనార్హం. చిత్తూరు మండలం, ముత్తుకూరు రీచ్‌లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడ తవ్వకాలు చేసి ముత్తుకూరు– తచ్చూరు జాతీ య రహదారి కూడలి సమీపంలో డంప్ చేస్తున్నారు. మూడు రోజుల క్రితం ఈ డంప్‌ను ప్రా రంభించారు. రీచ్ నుంచి డంప్‌కు రోజుకకు 80 నుంచి 100 ట్రాక్టర్ల ఇసుక చేరుతోంది. డంప్ నుంచి జేసీబీల ద్వారా టిప్పర్లకు లోడ్ చేస్తున్నారు.
రహదారి పేరుతో తరలింపు
డంప్ నుంచి గుడిపాల మండలంలో జరిగే రోడ్డుకని తెల్లబంగారాన్ని ఎత్తుకెళ్లిపోతున్నారు. అయితే గుడిపాల మీదుగా తమిళనాడుకు పట్టుకెళుతున్నారు. తమిళనాడులో డిమాండ్ ఉండడంతో రోజుకు రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షల వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులోని వేలూరు, కాట్పాడి, పొన్నై, తిరుత్తణి, చైన్నె, సోలింగరం తదితర ప్రాంతాల్లో దళారులను ఏర్పాటు చేసుకున్నారు. వారి ద్వారా వ్యాపారం సాగిస్తున్నట్టు తెలుస్తోంది.
అడిగే దమ్ముందా?
ఈ ఇసుక అక్రమ వ్యాపారాన్ని ముత్తుకూరుకు చెందిన ఓ నేత, గుడిపాలకు చెందిన మరో నేత కలిసి చేస్తున్నారు. ముత్తుకూరుకు చెందిన ఆ నేతే రీచ్ నుంచి డంప్ ప్రాంతానికి ట్రాక్టర్ల ద్వారా చేర్చడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అక్కడి నుంచి తమిళనాడుకు తరలించే ప్రక్రియ మొత్తం గుడిపాలకు చెందిన నేత చూసుకుంటున్నాడు. ఈ విషయం మండలంలోని పలువురు నేతలకు తెలియడంతో వారు తిరుగుబావుటా ఎగురవేశారు. గుడిపాలలో ఉండే వ్యక్తులు మా అడ్డాలో అక్రమ ఇసుక వ్యాపారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై సంబంధిత శాఖ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. అధికారులు అడ్డుకునే దమ్ము లేకుంటే అధినేతకు ఫిర్యాదు చేస్తామని టీడీపీలోని ఓ వర్గం నేతలు స్పష్టం చేస్తున్నారు.


