ఆన్‌లైన్‌లో తుది మెరిట్‌లిస్టు జాబితా
చిత్తూరు రూరల్ (కాణిపాకం): నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పోస్టుల భర్తీకి సంబంధించిన తుది మెరిట్ జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణి వెల్లడించారు. సాక్షి దినపత్రికలో శుక్రవారం ‘గుట్టుగా మెరిట్ లిస్టు’ శీర్షికన వార్త ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఆమె ప్రొవిజనల్ మెరిట్ లిస్టును తోసిపుచ్చి.. తుది మెరిట్ జాబితాను ఆన్‌లైన్‌లో పెట్టిన విషయా న్ని బహిర్గతం చేశారు. ఇక ఏయే పోస్టులను భర్తీ చేస్తున్నారో వెల్లడించారు. స్టాఫ్‌నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ, సపోర్టింగ్ స్టాఫ్, లాస్ట్‌గ్రేడ్ సర్వీసు పోస్టులను మాత్రమే భర్తీ చేయనన్నట్లు ప్రకటించారు. మిగిలిన పోస్టులు వాయిదా పడ్డాయన్నారు. కాగా తుది మెరిట్‌లిస్టునుwww.chittoor.ap.gov.in అనే సైట్‌లో ఈనెల 22వ తేదీ వరకు చూసుకోవచ్చని వెల్లడించారు.
టెట్‌కు 130 మంది గైర్హాజరు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో శుక్రవారం నిర్వహించిన టెట్ పరీక్షకు 130 మంది గైర్హాజరయ్యారని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఉదయం 542 మందికి గాను 456 మంది, మధ్యాహ్నం 541 మందికిగాను 497 మంది హాజరయ్యారని చెప్పారు. టెట్ ఐదు కేంద్రాల్లో జరిగిందని పేర్కొన్నారు.
అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు
వడమాలపేట (పుత్తూరు): వడమాలపేట మండలం, తిరుమణ్యం రెవెన్యూ అటవీ ప్రాంతంలో క్రూర మృగాల కదలికలను కనుగొనేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తిరుపతి జిల్లా అటవీ శాఖ అధికారి వి.సాయిబాబా తెలిపారు. ఈ నెల 16వ తేదీన తిరుమణ్యం అటవీ ప్రాంతంలో చిరుత మేకలను చంపినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో శుక్రవారం ఆ ప్రదేశాన్ని ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడారు. చిరుత దాడిలో మేకలు చనిపోలేదని స్పష్టం చేశారు. చిరుత ఒకదాని మీదనే దాడి చేసి, నోటితో కరచి తీసుకెళ్లిపోతుందని వివరించారు. ఈనెల 16న నాలుగు మేకలు మృతి చెందడానికి అడవి కుక్కలు (వైల్డ్ డాగ్స్) కారణమై ఉంటాయన్నారు. ఏది ఏమైనా గ్రామస్తుల సంరక్షణలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆయన వెంట ఫారెస్ట్ రేంజర్ బీ.సుదర్శన్‌రెడ్డి, ఎఫ్‌ఎస్‌ఓ వై.శంకరప్ప, ఎఫ్‌బీఓ ఎం.మునినాయక్, ఎంపీటీసీ రవి ఉన్నారు.
నేడు హైకోర్టు
న్యాయమూర్తి సమీక్ష
చిత్తూరు అర్బన్: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టు ఫోలియో జడ్జి జస్టిస్ నినాల జయసూర్య శనివారం చిత్తూరుకు రానున్నారు. చిత్తూరు నగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో పూర్వపు చిత్తూరు ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న న్యాయమూర్తులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇందు కోసం జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10 నుంచి సమావేశం ప్రారంభం కానుంది.
ఆన్‌లైన్‌లో తుది మెరిట్‌లిస్టు జాబితా


