పేదల దేవుడు వైఎస్ జగన్
వెదురుకుప్పం : చారిత్రాత్మక నిర్ణయాలతో సంక్షేమ పథకాలను అమలు చేసి పేదల తలరాతలను మార్చిన దేవుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేసి ప్రజల అభున్నతికి బాటలు వేశారని కొనియాడారు. నా ఎస్సీ.. నా బీసీ.. నా మైనారిటీ అంటూ బడుగులను అక్కున చేర్చుకున్న ఏకై క నాయకుడు వైఎస్ జగన్ అని వెల్లడించారు. సమాజంలో అందరితో పాటు సమానంగా ఉండాలన్న సంకల్పంతో అణగారిన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా పేదలకు అందించి, పాలనలో నూతన ఒరవడిని తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కిందని తెలిపారు. ఏకంగా 31 లక్షల మంది పేదలకు స్థలంతోపాటు ఇల్లు నిర్మించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు గుర్తు చేశారు. వైఎస్ జగన్ హయాంలో ఏ పథకమైనా పేదల సంక్షేమమే ప్రామాణికంగా తీసుకుని అమలు చేసినట్లు వెల్లడించారు. బడుగు, బలహీన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగు పరచి పేదల గుండెల్లో కొలువుదీరారని చెప్పారు. జగన్ పుట్టినరోజును ప్రతి పేదవాడి ఇంట్లో పండుగగా భావిస్తున్నారని తెలిపారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గవ్యాప్తంగా జననేత జన్మదిన వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మళ్లీ వైఎస్ జగన్ సీఎం కావాలని వివరించారు. చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని వర్గాలకు తీరని అన్యాయం జరుగుతున్నట్లు ఆరోపించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంతో కూటమిలో వణుకు మొదలైనట్లు తెలిపారు.


