యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా
సాక్షి టాస్క్‌ఫోర్స్ : బంగారుపాళెం మండలం మట్టి అక్రమ రవాణాకు కేంద్రంగా మారింది. మట్టి మాఫి యా మండలంలోని కొండలు, గుట్టలను తవ్వేసి మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది. ముఖ్యంగా మొగిలివెంకటగిరి రెవెన్యూ, పాలేరు జగనన్న కాలనీ వద్ద జాతీయ రహదారికి సమీపంలో ఉన్న గుట్టను 20 రోజుల నుంచి జేసీబీతో తవ్వి మట్టిని ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అనుమతులేవీ..?
మట్టిని తవ్వడానికి మైనింగ్ అనుమతులు తప్పనిసరి. అక్రమార్కులు అధికార పార్టీ నాయకుల అండతో అనుమతులు లేకుండానే మట్టిని తవ్వుతున్నారు. ఈ విషయాన్ని స్థానికులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. అక్రమార్కుల నుంచి ముడుపులు తీసుకుని మట్టి అక్రమ రవాణా గురించి పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మట్టి రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
మట్టిని టిప్పర్ల ద్వారా బంగారుపాళెం మీదుగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో దుమ్ము, ధూళి కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నట్టు దుకాణదారులు, ప్రజలు వాపోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాహనాలు వెళ్లేటప్పుడు దుమ్ము వెదజల్లుతోందని చెబుతున్నారు.
యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా


