ఆ టీడీపీ కార్పొరేటర్‌పై చర్యలు తీసుకోవాలి
చిత్తూరు అర్బన్: దర్యాప్తులో ఉన్న కేసు నుంచి తన పేరు తొలగించాలని బెదిరింపులకు దిగిన టీడీపీ కార్పొరేటర్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చిత్తూరుకు చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాలు శోభారాణి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. చిత్తూరుకు చెందిన టీడీపీ మహిళా కార్పొరేటర్ (న్యాయవాది కూడా) గురువారం రాత్రి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించడం, తన చావుకు డీఎస్పీ, సీఐలతో పాటు శోభారాణి కూడా కారణమని చెప్పడం తెలిసిందే. దీనిపై శోభారాణి స్పందిస్తూ తన సోదరుడి ఆత్మహత్య కేసులో ఆ కార్పొరేటర్‌ను నిందితులిరాలిగా చేరిస్తే, తన పేరు తొలగించాలని దర్యాప్తు అధికారులను బెదిరించడం కేసును పక్కదారి పట్టించడమే అవుతుందని పేర్కొన్నారు. న్యాయవాద వృత్తిలో ఉంటూ పోలీసులను బెదిరిస్తే కేసు ఎందుకు నమోదుచేయరని ప్రశ్నించారు. వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజల్లోకి మరోలా సంకేతం వెళుతుందని తెలిపారు.
ఇంటర్ యూనివర్సిటీ
పోటీలకు కుప్పం విద్యార్థి
కుప్పంరూరల్: కుప్పం డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్‌లో తృతీయ సంవత్సరం చదువుతున్న పి.రేవంత్ సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎస్వీ యూనివర్సిటీ తరుఫున ఎంపికై నట్లు కళాశాల చైర్‌పర్సన్ శాంతానాగరాజు చెప్పారు. తిరుపతిలో జరిగిన కాలేజీ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో ప్రతిభ కనబర్చి, డిసెంబర్ 25న చైన్నెలో జరిగే పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఈ మేరకు పి.రేవంత్‌ను శుక్రవారం కళాశాల అధ్యాపకులు అభినందించారు.


