ఉపాధిని రద్దు చేయొద్దు!
చిత్తూరు కార్పొరేషన్: ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసే కుట్రలు కేంద్ర ప్రభుత్వం చేస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి గంగరాజు తెలిపారు. శుక్రవారం స్థానిక గాంధీ విగ్రహం వద్ద నోటికి నల్ల గుడ్డలు కట్టుకొని మౌన దీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రస్తుత ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసే యోచనలో ఉందన్నారు. ఈ పథకానికి వెచ్చించాల్సిన నిధులను 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలే భరించే విధంగా నిబంధనలు మార్చాలని చూస్తున్నట్టు తెలిసిందన్నారు. ప్రజా సంక్షేమం కోసం గొప్పలు చెప్పే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ జిల్లా నాయకులు ఓబుల్‌రాజు, నాయకులు సురేంద్రన్, గిరిధర్ గుప్తా, చిట్టెమ్మ, ప్రసాద్, ప్రతాప్ పాల్గొన్నారు.


