అవినీతి తిమింగలాలు
20 సెంట్ల భూమి సర్వే చేసేందుకు రూ.35 వేలు లంచం సచివాలయ సర్వేయర్ రూ.20 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ పుంగనూరు రెవెన్యూ అవినీతిపై రైతు విజయం
పుంగనూరు: పుంగనూరు రెవెన్యూలో అవినీతి తిమింగలాలు పట్టుబడ్డాయి. 20 సెంట్ల భూమి సర్వే చేసి సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.35 వేలు ఒప్పందం చేసుకుని, రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా గ్రామ సచివాలయ సర్వేయర్‌ను ఏసీబీ పట్టుకుంది. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. ఏసీబీ అడిషినల్ ఎస్పీ విమలకుమారి కథనం.. మండలంలోని మంగళం గ్రామానికి చెందిన గ్రామ సచివాలయ సర్వేయర్ శ్రీరాములును అదే గ్రామానికి చెందిన రైతు ఉమాశంకర్ 20 సెంట్ల పొలాన్ని సర్వేచేసి, సర్టిఫికెట్ ఇవ్వమని కోరారు. దీనిపై సర్వేయర్ రూ.50 వేలు ఇస్తే సర్వేచేసి, రెవెన్యూ సర్టిఫికెట్ ఇస్తామని, లేకపోతే చేసేది లేదని తెగేసి చెప్పాడు. అంత డబ్బు ఇవ్వలేనని రైతు ఉమాశంకర్ చెప్పాడు. పలు మార్లు రెవెన్యూ అధికారుల వద్దకు తిరిగినా ఫలితం లేకపోయింది. ఎలాగైన రెవెన్యూ అధికారుల అవినీతిని బయటపెట్టాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో రైతు ఉమాశంకర్ సర్వేయర్ వద్దకు వెళ్లి రూ.35 వేలకు బేరం కుదుర్చుకున్నారు. బుధవారం రాత్రి 7 గంటలకు ఉమాశంకర్ తహసీల్దార్ కార్యాలయంలో రూ.20 వేలు సర్వేయర్ శ్రీరాములుకు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు పలురకాల ఫైళ్లను పరిశీలించారు. ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉందన్న విషయాలపై దర్యాప్తు చేపట్టారు. కాగా సర్టిఫికెట్లను జారీచేసే అధికారం తహసీల్దాకు మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కార్యాలయ అధికారులు కలసి సర్వేయర్ శ్రీరాములుతో ఈ పని చేయిస్తున్నారా?..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు నిందితుడ్ని అదుపులోనికి తీసుకున్నారు.
ఫోన్‌పేలోనే నేరుగా లంచాలు
రైతులను బహిరంగంగా లంచం డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయంలోనే లంచాలు తీసుకున్నట్టు విమర్శలున్నాయి. ఈ మేరకు పలుమార్లు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇదే కోణంలో ఇద్దరు వీఆర్‌వోలు లంచాలను ఫోన్ పేలో వేసుకోగా కలెక్టర్ వారిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన జరిగి ఆరు నెలలు కూడా గడవక ముందే ఏసీబీ దాడుల్లో సర్వేయర్ దొరకడం చర్చనీయాంశమైంది.
పుంగనూరులో అవినీతి అనకొండలు
పుంగనూరు రెవెన్యుశాఖలో అవినీతి తిమింగలాలు పాతుకుపోయాయి. గత ఏడేళ్ల క్రితం ఆర్‌ఐగా పనిచేస్తున్న ఉదయ్‌కుమార్‌ని ఏసీబీ అధికారులు పట్టుకుని అరెస్ట్ చేశారు. అలాగే తహసీల్దార్ రెడ్డెప్పను కూడా అరెస్ట్ చేశారు.
లంచాలు అడిగితే ఫిర్యాదు చేయండి
పుంగనూరులోని ప్రభుత్వ అధికారులు ఎవరైన ఏ పనికై నా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అడిషినల్ ఎస్పీ విమలకుమారి తెలిపారు. ఫిర్యాదు చేసే వ్యక్తుల పేర్లను రహస్యంగా ఉంచుతామన్నారు. అవినీతిని అంతమొందించేందుకు ప్రతి ఒక్కరూ తమకు సహకారం అందిస్తే ఉత్సాహంగా పనిచేసి అవినీతి అధికారుల భరతం పడుతామని తెలిపారు. అవినీతిపై 9440446190, 1064 నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు.


