విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
తవణంపల్లె : విద్యార్థులు భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్రప్రసాద్ ఆకాక్షించారు. బుధవారం మండలంలోని అరగొండ బాలుర హైస్కూల్‌లో మండల స్థాయి విజ్ఞాన మేళా ప్రదర్శన ( సెన్స్ ఫెయిర్) నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీఈఓ రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. మండలంలోని ఆరు ఉన్నత పాఠశాల్లోని విద్యార్థులు తయారు చేసిన సెన్స్ ప్రయోగాలను డీఈఓ రాజేంద్రప్రసాద్, ఎంఈఓలు హేమలత, మోహన్‌రెడ్డి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సెన్స్ ప్రయోగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన ఏడు టీములను ఎంపిక చేసి జిల్లా స్థాయి పోటీలకు పంపనున్నట్లు ఎంఈఓ హేమలత తెలిపారు. కార్యక్రమంలో మండలంలోని ఉన్నత పాఠశాలల సెన్స్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సృజనకు పదునుపెట్టాలి
బంగారుపాళెం : సృజనాత్మక ఆలోచన పెంపొందించుకునేందుకు ‘విద్య వైజ్ఞానిక ప్రదర్శన’లు గొప్ప వేదికలని ఎంఈఓ రమేష్‌బాబు అన్నారు. బుధవారం బంగారుపాళెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మండల స్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. మండలంలోని 14 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి 110 మంది విద్యార్థులు, 20 మంది ఉపాధ్యాయులు మేళాలో పాల్గొన్నారు. విద్యార్థుల విభాగంలో తుంబకుప్పం, కీరమంద, గుండ్లకట్టమంచి, మంగళపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బంగారుపాళెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రదర్శనలతో జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఉపాధ్యాయుల విభాగంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తుంబకుప్పం జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కార్యక్రమంలో హెచ్‌ఎం రాజేంద్రన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


