ప్రణాళికతో చదివితే.. ‘పది’ంతల విజయం!
విద్యార్థి దశలో పదో తరగతి అత్యంత కీలకం. బంగారు భవితకు పునాది. ఉన్నత శిఖరాల అధిరోహణకు తొలి మెట్టు. అలాంటి పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో అధికారులు వంద శాతం ఉత్తీర్ణత సాధనకు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందు కోసం జిల్లాలో 100 రోజుల ప్రణాళికను సిద్ధం చేసి పాఠశాలల్లో అమలుకు శ్రీకారం చుట్టారు. దీంతోపాటు చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు.
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో.. డిసెంబర్ నుంచి మార్చి వరకు వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నారు. ఆయా సబ్జెక్టుల టీచర్లు విద్యార్థులకు ప్రత్యేక సూచనలు ఇస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. 2026 మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. గతంలో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుని, మరింత మెరుగైన ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. సబ్జెక్టు వారీగా విద్యార్థులకు అసైన్‌మెంట్స్ నిర్వహిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులు కూడా ఉత్తీర్ణత సాధించేలా వారికి ఉపాధ్యాయులు ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు.
రోజు వారీ ప్రత్యేక తరగతులు
డిసెంబర్ 6 నుంచి మార్చి 15వ తేదీ వరకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలను ప్రకటించారు. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి 9 వరకు రెమిడియల్ క్లాసులు, తరువాత 9.15 నుంచి సాయంత్ర 4 గంటల వరకు నాలుగు సబ్జెక్టుల బోధన ఉంటుంది. సాయంత్రం నాలుగు నుంచి ఐదు వరకు ప్రతి రోజూ ఒక సబ్జెక్టులో పరీక్ష నిర్వహిస్తారు. అందులో వచ్చిన మార్కులను ఆన్‌న్‌లైనన్ చేస్తారు. ఆ మరుసటి రోజు ముందు రోజు చదవిన సబ్జెక్టుకు సంబంధించి పరీక్షలో వచ్చిన మార్కులపైన పునఃశ్చరణ తరగతులు ఉంటాయి. ఇలా ఐదు రోజులపాటు శని, ఆదివారాలు, సెలవు దినాల్లో కూడా ప్రణాళిక అమలు చేస్తున్నారు. జనవరిలో కేవలం సంక్రాంతికి సంబంధించి బోగి, సంక్రాంతి, కనుమ పండుగ మూడు రోజులు మినహా మిగతా రోజులు యథావిధిగా ప్రణాళిక అమలు చేయనున్నారు.
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 380
ప్రైవేట్ హైస్కూల్స్ 185
మొత్తం ఉన్నత పాఠశాలలు 565
పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 26,789
ప్రణాళికతో చదివితే.. ‘పది’ంతల విజయం!


