మెడికల్ కళాశాలలు ప్రభుత్వమే నిర్వహించాలి
పుంగనూరు: అబద్ధపు హామీలతో విద్యార్థులను మోసంచేస్తే సహించేది లేదని బాబు ప్రభుత్వాన్ని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణపై మంగళవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గోకుల్ సర్కిల్ వద్ద మానవహారం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ యువగళం పాదయాత్రలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను మరచిపోయారన్నారు. విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తూ 107, 108 జీవోలను రద్దు చేయకపోగా, 590 జీవో ద్వారా మెడికల్ కళాశాలలను కార్పొరేటర్లకు ధారాదత్తత చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను విరమించుకుని ప్రభుత్వమే బాధ్యతగా చేపట్టాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థి, యువజన సంఘాలతో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర సమితి సభ్యులు మున్న, జిల్లా ఉపాధ్యక్షుడు సంజయ్, నాయకులు వసంత్‌అమన్, సీపీఐ నాయకులు రమణారెడ్డి, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.


