చిరుత దాడిలో మేకలు మృతి
వడమాలపేట (పుత్తూరు): వడమాలపేట మండలం తిరుమణ్యం పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం చిరుత దాడి చేసి నాలుగు మేకలను చంపినట్లు ఎస్‌ఐ హరీష్ తెలిపారు. మేత కోసం వెళ్లిన మేకల గుంపుపై చిరుత దాడి చేయడాన్ని గ్రామస్తులు చూసినట్లు తెలిపారు. పెద్ద ఎత్తున శబ్దం చేయడంతో చిరుత పారిపోయినట్లు గ్రామస్తులు తెలిపారన్నారు. తిరుమణ్యం గ్రామానికి వెళ్లి పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా హెచ్చరించినట్లు తెలిపారు. పుత్తూరు ఫారెస్ట్ అధికారులకు సైతం సమాచారం అందించారు. ఈ నెల 12న పుత్తూరు ప్రాంతంలో కనబడిన చిరుతే వడమాలపేట మండలంలోకి ప్రవేశించి ఉంటుందని, దానిని బంధించడానికి తగిన చర్యలు చేపడుతున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.


