అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి
చౌడేపల్లె: అతిగా మద్యం సేవించి చౌడేపల్లి మండలంలో మంగళవారం ఓ వ్యక్తి మృతి చెందాడు. మండలంలోని తామరాకులకుంటకు చెందిన కుట్టి అలియాస్ బీరయ్య(31) మంగళవారం కూలి పనులతోపాటు అటవీ ఫలసాయం సేకరించి వాటిని విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత రెండు రోజులుగా మేకల చిన్నేపల్లె పరిసర ప్రాంతాల్లో మద్యం సేవించి రోడ్డు పక్కనే పడి ఉన్నాడు. మంగళవారం స్థానికుల సమాచారంతో అతని కుటుంబీకులు ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా అప్పటికే అతను మృతి చెంది ఉన్నాడు. మృతుడికి భార్య, పిల్లలున్నారు. అతని మృతితో ఆ కుటుంబం వీధిన పడింది. మండలంలోని పలు గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు షాపులు నడుస్తున్నాయి. కొందరు అతిగా మద్యం సేవించి అపస్మారక స్థితికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే మృత్యువాత పడి కుటుంబీకులకు కన్నీళ్లు మిగుల్చుతున్నారు.


