కరెంటు షాక్‌కుగురైన ఎస్పీడీసీఎల్ ఉద్యోగి
శాంతిపురం: మఠం పంచాయతీలోని సంతూరు వద్ద కరెంటు షాక్‌కు గురై ఎస్పీడీసీఎల్ కాంట్రాక్టు ఉద్యోగి పురుషోత్తం తీవ్రంగా గాయడపడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. దండికుప్పం పంచాయతీలోని చౌడంపల్లికి చెందిన పురుషోత్తం దండికుప్పం సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్‌గా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నాడు. తనకు సెలవు ఉన్న రోజుల్లో రెస్కో లైన్‌మెన్లు, హెల్పర్లతో కలిసి ఫీల్డ్ పనులకు వెళ్తుంటాడు. సోమవారం ఒక ట్రాన్స్‌ఫార్మర్ ఎర్తింగ్ మరమ్మత్తు కోసం రెస్కో హెల్పర్ నాగరాజు పురమాయించడంతో పురుషోత్తం ఆ పని చేసేందుకు సంతూరు వద్దకు వచ్చాడు. అక్కడ ఉన్న ఇద్దరు రైతులను ఉప్పు, బొగ్గుల కోసం ఒకరిని, బోల్టు నట్టుల కోసం మరొకరిని పురుషోత్తం పంపించాడు. నిమిషాల వ్యవధిలో బారీ శబ్దం రావడంతో ఆ రైతులు వెనక్కి తిరిగివచ్చే సరికి ట్రాన్స్‌ఫార్మర్‌పై పడి కాలుతున్న పురుషోత్తంను గుర్తించారు. తక్షణం గుండిశెట్టిపల్లి సబ్‌స్టేషన్‌కు రైతులు ఫోన్ చేసినా తీసేవారు లేరు. దీంతో తమకు తెలిసిన రెస్కో సిబ్బందికి సమాచారం ఇచ్చి, వారు సబ్‌స్టేషన్‌లోని లైన్‌మెన్‌కు తెలిపి విద్యుత్ సరఫరాను ఆపించారు. అనంతరం కాళ్లు, ఒళ్లు తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న బాధితుడిని ట్రాన్స్‌ఫార్మర్‌పై నుంచి కిందికి దింపారు. 108 అంబులెన్సు ద్వారా కుప్పం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. పురుషోత్తం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.


