పకడ్బందీగా కెరీర్ ఫెస్ట్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు కెరీర్ ఫెస్ట్‌ను పకడ్బందీగా నిర్వహించాలని సమగ్రశిక్షశాఖ ఏపీసీ వెంకటరమణ ఆదేశించారు. ఈ మేరకు శనివారం జిల్లా కార్యాలయంలో కెరీర్ ఫెస్ట్ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఏపీసీ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు కెరీర్ ఫెస్ట్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 20న జిల్లా స్థాయిలో కెరీర్ ప్రదర్శనను నిర్వహించనున్నట్టు తెలిపారు. కేజీబీవీ జీసీడీవో ఇంద్రాణి, కెరీర్‌ఫెస్ట్ జిల్లా కో–ఆర్డినేటర్ ఛాయేంద్రకుమార్ పాల్గొన్నారు.
రాజీమార్గమే ఉత్తమం
చిత్తూరు లీగల్: న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి రాజీమార్గం ఉత్తమమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అన్నారు. జిల్లా న్యాయ స్థానాల సముదాయంలో శనివారం జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లా జడ్జి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో రాజీ ద్వారా కేసులను పరిష్కరించుకున్న తరువాత దీనిపై అప్పీలుకు వెళ్లడానికి వీలుండదని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన అదాలత్ కోసం 32 బెంచీలను ఏర్పాటు చేశామన్నారు. దీర్ఘకాలికంగా న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి అదాలత్ ఒకటే మార్గం అన్నారు. అనంతరం కేసులు పరిష్కరించుకున్న కక్షిదారులకు అవార్డు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు భారతి, శ్రీదేవి, ఉమాదేవి, మాధవి, షేక్ బాబాజాన్, వెన్నెల, చిత్తూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు శంకర్ నాయుడు పాల్గొన్నారు.
ఆటోను ఢీకొన్న కారు
– ఆరుగురికి గాయాలు
బంగారుపాళెం: మండలంలోని నల్లంగాడు గ్రామం వద్ద శనివారం ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. తుంబకుప్పం నుంచి బంగారుపాళెం వస్తున్న ప్యాసింజర్ ఆటోను నల్లంగాడు గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ఘటనలో ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నల్లంగాడు, పెరుమాళ్లపల్లెకు చెందిన ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 ద్వారా చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.. శుక్రవారం అర్ధరాత్రి వరకు 67,202 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,864 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 08 గంటల సమయం పడుతోంది.
పకడ్బందీగా కెరీర్ ఫెస్ట్


