ఎన్‌జీవో సంఘ జిల్లా అధ్యక్షుడిగా రాఘవులు
చిత్తూరు కలెక్టరేట్ : ఏపీ ఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడిగా రాఘవులు (జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి) వరుసగా రెండో సారి ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 17 స్థానాలకు గాను చిత్తూరు జిల్లాలోని 6 తాలూకాల పరిధిలోని 18 మంది తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఇందులో కార్యదర్శి పదవికి రెండు నామినేషన్‌లు దాఖలు కాగా, మిగిలిన స్థానాలకు ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. అయితే యూనియన్ నేతల రాజీయత్నాల అనంతరం కార్యదర్శి పదవికి నామినేషన్ వేసిన మహేష్ అనే ఉద్యోగి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలో అధ్యక్షులుగా రాఘవులు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా రమేష్, కోశాధికారిగా మురళి (డీఈవో కార్యాలయం) ఎన్నికయ్యారు. వీరితో పాటు 14 మంది కార్యవర్గ ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా అధ్యక్షునిగా ఎన్నికై న రాఘవులు విలేకరులతో మాట్లాడారు. తమ మూడేళ్ల పదవీకాలంలో జిల్లాలోని నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల అధికారిగా గుంటూరు జిల్లా యూనియన్ అధ్యక్షులు శ్రీనివాసరావు, సహ ఎన్నికల అధికారిగా గుంటూరు జిల్లా యూనియన్ సెక్రటరీ శ్యామసుందరరావు, ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి జగదీశ్వరరావు వ్యవహరించారు.


