నూతన వసతి గృహానికి భూమి పూజ
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నూతన సంక్షేమ వసతి గృహం ఉపయోగకరమని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ తెలిపారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని కణ్ణన్ ప్రభుత్వ పాఠశాల, కళాశాల ప్రాంగణంలో నూతన ప్రభుత్వ సంక్షేమ వసతి గృహం నిర్మాణానికి భూమి పూజ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ పేద విద్యార్థుల అభ్యున్నతికి కణ్ణన్ ప్రభుత్వ పాఠశాల, కళాశాల ప్రాంగణంలో రూ.కోటి బడ్జెట్‌తో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహ నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన కణ్ణన్ పాఠశాల, కళాశాల అభివృద్ధికి వసతి గృహం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చుడా చైర్మన్ కఠారి హేమలత, కళాశాల ప్రిన్సిపల్ సయ్యద్ మౌలా పాల్గొన్నారు.


