విషాద యాత్ర
ఎక్కడెక్కడి నుంచో వచ్చి.. అక్కడ ప్రాణాలు వదిలారు చాలా మందికి విహార యాత్రల ద్వారానే పరిచయాలు ఏటా ఆలయాల సందర్శన.. దైవ భక్తితో యాత్రలు ఒక్కొక్కరికి రూ.10,500 ప్యాకేజీ.. అరకు కోసం రూ.500 అదనం 37 మందితో చిత్తూరు నుంచి బయలుదేరిన బస్సు
చిత్తూరు అర్బన్ : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు–మారేడు మిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారి మెట్ట వద్ద బస్సు లోయలో పడ్డ ప్రమాదంలో చిత్తూరు , తిరుపతి జిల్లాలకు చెందిన తొమ్మిది మంది మృత్యువాత పడ్డ ఘటన ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆలయాల సందర్శన, దైవ దర్శనం కోసం వెళ్లిన విహార యాత్ర కాస్త విషాద యాత్రగా మారింది. ఈ ప్రమాదంలో చిత్తూరు నగరానికి చెందిన నాగేశ్వరరావు (68), శ్రీకళాదేవి (64), కావేరి కృష్ణ (70), శ్యామల (67), తవణంపల్లె మండలానికి చెందిన దొరబాబు (37), పలమనేరుకు చెందిన దంపతులు శివశంకర రెడ్డి (47), సునంద (45), పెనుమూరుకు చెందిన క్రిష్ణకుమారి (47), తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీ టెలిఫోన్ కాలనీకి చెందిన తెనాలి శైలజా రాణి(64) దుర్మరణం పాలయ్యారు. కాగా చిత్తూరు నగరం మిట్టూరుకు చెందిన కావేరి కృష్ణ ప్రస్తుతం బెంగళూరులో స్థిరపడ్డారు.
ఒకరికొకరు అలా..
చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రం నుంచి ఈనెల 6వ తేదీన విఘ్నేశ్వర ట్రావెల్స్ పేరిట ఉన్న బస్సు విహార యాత్రకు బయలుదేరింది. 32 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, ఓ వంట మనిషి, ట్రావెల్ ఏజెంటు మొత్తం 37 మందితో కలిసి చిత్తూరు నుంచి బస్సు బయలు దేరింది. అయితే ఇందులో ఉన్న ప్రయాణికుల్లో కొందరు భార్యాభర్త, మరికొందరు ఒంటరిగా విహార యాత్రకు వెళ్లారు. వీరిలో చాలా మందికి ఒకరికొకరితో పెద్దగా పరిచయాలు లేవు. చిత్తూరులోని దొడ్డిపల్లెకు చెందిన ట్రావెల్ ఏజెంటు వజ్రమణి అనే వ్యక్తి ఏటా నాలుగు సార్లు విహార యాత్రలు ప్లాన్ చేస్తుంటాడు. ప్రధానంగా హిందూ ఆలయాల సందర్శన కోసం పలువురు వృద్ధులను తీసుకెళుతుంటాడు. ఈ నేపథ్యంలో బస్సులో ప్రయాణించిన ప్రయాణికులకు గతంలో వెళ్లిన విహార యాత్రల ద్వారా పరిచయమైన వాళ్లే. ఒకరికొకరు తోడు అన్నట్లు.. ఏటా కచ్చితంగా ఒక్క విహారయాత్రకై నా చిత్తూరు వాసులు కలుస్తుంటారు. భోజనంతో కలిపి ఒక్కొక్కరికీ రూ.10,500 చొప్పున వసూలు చేసి, ఈ ప్యాకేజీను పెట్టారు. అరకు వెళ్లడానికి అదనంగా రూ.500 వసూలు చేశారు. ప్రధానంగా చిత్తూరులోని పాత కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ఉన్న మరాఠ వీధికి చెందిన 12 మంది ఈసారి విహార యాత్రకు బయలుదేరి వెళ్లారు. ఒకే వీధికి చెందిన వాళ్లు కావడంతో మూడు నెలల క్రితమే ప్లాన్ చేసుకుని, ఒకరికొకరు మాట్లాడుకుని ఈ యాత్రకు బయలుదేరారు.
15 ప్రాంతాలు పూర్తి చేసి.
మొత్తం వారం రోజుల విహార యాత్రలో 25 ప్రాంతాలను చూసేలా ముందస్తు ప్రణాళిక చేసుకున్నారు. చిత్తూరులో బయలుదేరిన బస్సు చిలకలూరిపేటలో హైదరాబాద్‌కు చెందిన వెంకటలక్ష్మి, చంద్రగోపాలరెడ్డిని ఎక్కించున్నారు. అటునుంచి తొలుత కోటప్పకొండ, అమరావతి, మంగళగిరి, విజయవాడ, ద్వారకాతిరుమల, భీమవరం, పాలకొల్లు క్షీరలింగేశ్వరస్వామి ఆలయం, అంతర్వేది, వైశ్యపెనుగొండ, ద్రాక్షారామం, కొత్తపల్లె, సామర్లకోట, పిఠాపురం, అన్నవరం, సింహాచలం ప్రాంతాల్లోని ప్రముఖ హిందూ ఆలయాల్లో దైవ దర్శనం చేసుకున్నారు. అయిదు రోజుల పాటు సాగిన ఈ యాత్ర ఆరో రోజైన గురువారం అరకులో గడిపారు. ఆపై అరసవెళ్లి, రాజమండ్రి, భద్రాచలం చూసుకుని విజయవాడ మీదుగా శ్రీశైలం, మహానంది, అహోబిలం, బ్రహ్మంగారిమఠం, ఒంటిమిట్ట, తాళ్లపాక ప్రాంతాలను శుక్ర, శనివారాల్లో పూర్తి చేసుకుని తిరుపతి మీదుగా చిత్తూరుకు చేరుకోవాలని భావించారు. కానీ 15 ప్రాంతాలను చూసి, చివరకు ప్రమాదంలో కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటే..మరికొందరు గాయాలతో బయటపడ్డారు.
ప్రమాదంలో క్షతగాత్రులు
గాయపడ్డ వాళ్లల్లో చిత్తూరు నగరంలోని గిరింపేట, కట్టమంచి, దొడ్డిపల్లె ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. క్షతగాత్రుల్లో డ్రైవర్లు ఆర్.మధుశ్రీను (32), పోకల ప్రసాద్ (39), ట్రావెల్ ఏజెంటు వజ్రమణి (50)తో పాటు చిత్తూరుకు చెందిన వై.వెంకట నరసింహారెడ్డి (62), పాపర రమేష్‌బాబు (60), ఎస్‌కె.ముంతాజ్ బేగం (55), రాశిరెడ్డి మధుమతి (58), బొజ్జా పద్మజ (55), ఎస్‌కె.అశ్రఫ్ (54), ఎన్.స్వర్ణలత (75), తలపులపల్లె గోపిరెడ్డి (72), ఆయన భార్య తలపులపల్లె రమణమ్మ (66), కల్లూరి ప్రత్యూష (35), ఎస్.అమ్ములు బాయ్ (59), పాపర జవహరి (51), బి.భారతమ్మ(45), హైదరాబాద్‌కు చెందిన తిమ్మలచెరువు చంద్రగోపాలరెడ్డి (73),టి.వెంకటలక్ష్మి (60), కుప్పానికి చెందిన పి.విజయమ్మ (55), పాకాలకు చెందిన కె.రామస్వామిపిళ్లై (68) ఆయన సతీమణి కె.రుక్మిణిపిళ్లై (62), బెంగళూరుకు చెందిన కె.ఉషారాణి (60), పుంగనూరుకు చెందిన కె.నళిని (51), బెంగళూరుకు చెందిన చంద్రారెడ్డి (71), టి.గోపిరెడ్డి (72), వి.కుమారి (72), రామచంద్రన్ ఉన్నారు.
తిరుచానూరులో విషాదం
చంద్రగిరి : మారేడుమిల్లి ఘాట్‌రోడ్డులో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీ టెలిఫోన్ కాలనీకు చెందిన విశ్రాంతి అధికారిణి ఈ ప్రమాదంలో తుదిశ్వాస విడిచింది. టెలిఫోన్ కాలనీకు చెందిన తెనాలి శైలజా రాణి(64), ఐదేళ్ల క్రితం గ్రంథాలయ అధికారిణికి రిటైర్డ్ అయ్యారు. అప్పటి నుంచి టెలిఫోన్ కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ఒంటిరిగా జీవనం సాగిస్తోంది. తరచూ ఆమెను చూసేందుకు పెద్దగా ఎవరూ లేకపోవడంతో తీర్థయాత్రలకు వెళ్తూ వచ్చేది. ఆరు నెలలకో, ఏడాదికోసారి ఆమె కుమారుడు వచ్చి వెళ్లేవాడని, అతడి వివరాలు ఎవరికి తెలియదని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 8వ తేదిన ఇంటి ఓనర్ రామస్వామి పిళ్లై, రుక్మిణి పిళ్లై దంపతులతో కలసి శైలజరాణి తీర్థయాత్రలకు కోసం చిత్తూరుకు వెళ్లింది. దురదృష్టవశాత్తు శుక్రవారం మారేడుమిల్లి వద్ద తెల్లవారుజామున చోటు చేసుకున్న బస్సు ప్రమాదంలో శైలజరాణి మృతి చెందింది. రామస్వామి పిళ్లై, రుక్మిణి పిళ్లైలు గాయాలపాలయ్యారు. ఆమె ఒంటరిగా జీవనం సాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఆమెకు సుబ్బయ్య అనే తమ్ముడు ఉన్నట్లు గుర్తించారు. సుబ్బయ్య వివరాల కోసం పోలీసులు విచారణ చేపడుతున్నారు.
ఒకే వీధిలో ఇద్దరు మృతులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో చిత్తూరు నగరం గిరింపేటలోని మరాఠివీధికి చెందిన ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. దీంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే వీధిలో ఇద్దరు మృతి చెందడంతో ఆ వీధి శోకసంద్రంలో మునిగిపోయింది.
నాగేశ్వరరావు కుటుంబ నేపథ్యం
చిత్తూరు నగరం గిరింపేటలోని మరాఠివీధిలో రాజేశ్వరరావు(68), అముల్‌భాయ్ నివాసమున్నారు. ఈ దంపతులకు పిల్లలు లేరు. నాగేశ్వరరావు ఓ కంపెనీలో పనిచేస్తూ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. వచ్చే పెన్షన్ డబ్బులతో బతుకు జీవనం సాగిస్తున్నారు. నాలుగురోజులకు క్రితం విహారయాత్రకు వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో నాగేశ్వరరావును మృత్యువు కబళించింది. అముదభాయ్ తీవ్రగాయాలతో బయట పడ్డారు. మృతి చెందిన విషయాన్ని బంధువులకు ఫోన్ చేసి వివరించారు. వారి రాకతో ఇంటి వద్ద కన్నీటి సుడులు అలుముకున్నాయి.
శ్రీకళాదేవి కుటుంబ నేపథ్యం
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన శ్రీకళాదేవి(64) కూడా చిత్తూరు నగరం గిరింపేటలోని మరాఠివీధినే. శ్రీకళ టీచర్‌గా పనిచేస్తూ రిటైరయ్యారు. భర్త రాజారెడ్డి కూడా ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ... ఆరేళ్ల క్రితం మృతి చెందారు. ఈ దంపతులకు భసవంత్‌రెడ్డి అనే కుమారుడు ఉన్నారు. ఇతను ప్రస్తుతం యూఎస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. యూఎస్‌లో ఉన్న కుమారుడికి కూడా మృతి చెందిన విషయాన్ని కుటుంబీకులు తెలియజేశారు. శుక్రవారం ఉదయానికే వచ్చేస్తానని వెళ్లారని కంటతడిపెట్టారు.
మనవరాలి స్వెట్టర్‌తో గుర్తింపు
చిత్తూరు కార్పొరేషన్ : చిత్తూరుకు చెందిన ట్రాన్స్‌కో విశాంత్ర ఉద్యోగి శ్యామల(67) తీర్థయాత్రకు వెళ్లి తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. గతంలో చిత్తూరు స్థానిక బీవీరెడ్డి కాలనీలో నివాసం ఉండేవారు. విద్యుత్‌శాఖ అర్బన్ డివిజన్ ఈఆర్వో విభాగం సీనియర్ సహాయకురాలిగా పనిచేస్తూ 2018లో రిటైరయ్యారు. భర్త భాస్కర్‌రెడ్డి గంగాధరనెల్లూరు మండలంలో హెడ్‌మాస్టర్‌గా రిటైరయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు ప్రసాద్ బెంగళూరు కన్‌స్ట్రక్షన్ వ్యాపారం చేస్తున్నారు. కుతూరు నీలమ్మ హైదరబాద్‌లో నివాసముంటున్నారు. భర్త మరణం, అల్లుడు రవికుమార్ 2006లో మరణించడంతో నీలమ్మ పదవీ విరమణ అప్పటి నుంచి హైదరాబాద్‌లో కూతురు వద్దకు వెళ్లి సిర్థపడ్డారు. మలి వయస్సులో విహార యాత్రకు వెళతానని తిరుపతిలోని శ్యామల సోదరుడు నివాసంలో కొద్దిరోజులు ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. టూర్ బస్సులో తిరుపతి నుంచి వెళ్లినట్లు గుర్తుచేసుకొని కన్నీటిపర్యంతమయ్యారు. ప్రమాదం విషయం న్యూస్ ఛానెల్ ద్వారా తెలుసుకున్న నీలిమ వాళ్ల అమ్మ ప్రయాణించే బస్సు ఉండదని అనుకున్నారు. తదుపరి శ్యామల ఫోన్ పనిచేయకపోవడంతో ట్రావెల్స్ వారి నంబర్లు తెలుసుకొని వివరాలు అడిగారు. వారు వివరాలు సక్రమంగా చెప్పలేకపోవడంతో ఆందోళన చెందారు. తీరా టీవీలో మనవరాలు దీక్షిత స్వెట్టర్‌తో ఉన్న శ్యామల వీడియోను చూశాక నిర్ధారణకు వచ్చామని కన్నీటి పర్యంతం చెందారు. మృతదేహం చిత్తూరుకు వచ్చాక దహనక్రియలు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు వివరించారు.
దైవదర్శనం కోసం వెళ్లి కానరాని లోకాలకు..
పెనమూరు (కార్వేటినగరం) : దైవ దర్శనం కోసం వెళ్లిన క్రిష్ణకుమారి (47) బస్సు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా పెనుమూరు మండల బలిజపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. క్రిష్ణకుమారి, హరినాథరెడ్డి దంపతులకు ఒక కుమార్తె ఉంది. స్వస్థలం బలిజపల్లి గ్రామమైనా వ్యాపార నిమిత్తం బెంగళూరులోని కే ఆర్ పురం సమీపంలో బట్రహళ్లిలో స్థిరపడ్డారు. హరినాథరెడ్డి జేసీబీలు, హిటాచ్‌లు వంటి యంత్రాలను లీజుకు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయాల సందర్శనార్థం ఈ నెల 6వ తేదీ చిత్తూరు నుంచి బయలు దేరిన ప్రైవేటు బస్సులో బయలు దేరారు. అయితే భద్రాచలం సమీపంలోని మారేడుపల్లి వద్ద బస్సు అకస్మాత్తుగా లోయలో పడిన ఘటనలో కృష్ణకుమారి మృతి చెందింది. సమాచారం అందుకున్న ఆమె భర్త హరినాథరెడ్డి , బంధువులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహం కోసం పడిగాపుల కాస్తున్నట్లు సమాచారం. గ్రామంలో క్రిష్ణకుమారి బంధుమిత్రులు బోరున విలపిస్తున్నారు.


