నాభర్తకు ఏమైందీ..స్వామి ఎవ్వరూ చెప్పలేదేం..!
తవణంపల్లె : నాభర్తకు ఏమైందీ...స్వామి ఎవ్వరూ ఏమీ చెప్పరేం...బంధువులంతా ఇంటికి వస్తుంటే ఏమో అయిందీ..కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. నా భర్త క్షేమంగా తిరిగి వస్తాడు కదా.. అని బస్సు బోల్తాపడిన ప్రమాదంలో మృతి చెందిన దొరబాబు(37) భార్య సుమలత కన్నీటి పర్యంతమయ్యారు. తవణంపల్లె మండలం నారసింహనపల్లెకు చెందిన దొరబాబు(37) వంట మాస్టర్‌గా పనులు చేసుకొంటూ కుటుంబాన్ని పోషించుకొనే వాడు. ఇతడికి భార్య సుమలత, కుమార్తెలు పావని, మౌనిక, మోహన్‌కృష్ణ ఉన్నారు. పావని చెర్లోపల్లె హైస్కూల్లో 9వ తరగతి, మౌనిక 7 వ తరగతి, మోహన్‌కృష్ణ 6 వ తరగతి హాస్టల్లో చదువుతున్నారు. సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి దట్టమైన అటవీప్రాంతంలో బస్సు లోయలో బోల్తా పడి జరిగిన ఘోర ప్రమాదం దొరబాబు మృతి చెందాడు. భర్త మృతి చెందిన విషయం తెలిస్తే భార్య ఏమౌతుందోనని బంధువులు భర్త మరణవార్త చెప్పకుండా గోప్యంగా ఉంచి ప్రమాదం జరిగిందని చెప్పారు. కానీ బంధువులందరూ ఇంటి దగ్గరకు చేరుకోవడంతో మృతుడి భార్య సుమలత కన్నీటి పర్యంతమవుతున్నారు. నాభర్తకు ఏమైనా జరిగితే బిడ్డలు నేను ఎలా బతకాలని కన్నీమున్నీరయ్యారు.


