‘పది’పై ప్రత్యేక దృష్టి
చిత్తూరు కలెక్టరేట్ : పది పరీక్షలపై ప్రత్యేక దృష్టి వహించి పటిష్ట ప్రణాళికలు అమలు చేస్తామని నూతన డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం డీఈవో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను గతంలో రాయచోటి, బుక్కపట్నం డైట్ కళాశాలల్లో లెక్చరర్‌గా, రాయచోటిలో డీవైఈవోగా పనిచేశానని, చిత్తూరు జిల్లాకు డీఈవోగా నియమితులు కావ డం అదృష్టకరమన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠ శాలలపై ప్రత్యేక దృష్టి వహిస్తానన్నారు. బడికి డుమ్మా కొట్టే టీచర్లపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నా రు. టీచర్లు విధుల పట్ల అంకిత భావంతో ఉండాలన్నారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించి, చిత్తూరు జిల్లా మంచి ఉత్తీర్ణతతో ముందడుగు వేసేలా చర్యలు చేపడుతానన్నారు. ఆకస్మిక తనిఖీలు ఉంటాయని వెల్లడించారు. అనంతరం నూతన డీఈవోను ఏడీ లు వెంకటేశ్వరరావు, సుకుమార్, సిబ్బంది మురళి, గోపాల్, చైతన్య తదితరులు కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. పలు సంఘాల నాయకులు డీఈవోను మర్యాదపూర్వకంగా కలిశారు.


