బాబును నమ్మడమంటే మోసపోవడమే
పుంగనూరు: చంద్రబాబును నమ్మడం అంటే మోసపోవడమేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దెవా చేశారు. బుధవారం పట్టణంలో వైద్యకళాశాలల ప్రైవేటీకరణను నిరశిస్తూ కోటి సంతకాల బుక్‌లెట్ల వాహనానికి జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అభిమానులు అధిక సంఖ్యలో హాజరై, వైఎస్సార్ జిందాబాద్.. పెద్దిరెడ్డి జిందాబాద్.. మిథున్‌రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ర్యాలీ బస్టాండు నుంచి ఎంబీటీ రోడ్డు, పోలీస్ స్టేషన్ మీదుగా గోకుల్ సర్కిల్ నుంచి తిరుపతికి వెళ్లింది. ర్యాలీని ఉద్దేశించి పెద్దిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే వాటిని విస్మరించడం ఆయన నైజం అన్నారు. సూపర్–6 పేరుతో ఒక్కహామీనైనా నేరవేర్చాడా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కానరాలేదని, ప్రభుత్వ సంపదను ప్రైవేటీకరించడమే తండ్రి, కొడుకుల లక్ష్యమని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ హయాంలో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పేదరికమే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించారని గుర్తుచేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌లు చేయడం, వేధించడం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టీడీపీ పరిపాలనపై ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు అనీషారెడ్డి, కొండవీటి నాగభూషణం, మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, ఎంపీపీలు భాస్కర్‌రెడ్డి, సురేంద్రరెడ్డి, జెడ్పీటీసీలు సోమశేఖర్‌రెడ్డి, దామోదర్‌రాజు, పార్టీ యూత్‌వింగ్ జిల్లా కన్వీనర్ కొత్తపల్లి చెంగారెడ్డి, జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ అమ్ముతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


