బాలిక లైంగిక దాడి కేసులో 20 ఏళ్ల జైలు
చిత్తూరు లీగల్: ప్రేమ.. పెళ్లి పేరిట మాయ మాటలు చెప్పి.. తన మాట వినకపోతే మీ అమ్మా నాన్నను చంపేస్తానని బెదిరించి.. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ముద్దాయికి చిత్తూరు పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.4,500 జరిమానా విధిస్తూ బుధవారం తీర్పునిచ్చింది. చిత్తూరు పోక్సో కోర్టు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహన కుమారి కథనం మేరకు.. 2021 సంవత్సరంలో వెదురుకుప్పం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక (14)తో అదే మండలం కాపుమొండివెంగనపల్లికి చెందిన టి.మణి అనే వ్యక్తి పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని నమ్మించాడు. తన మాట వినకపోతే మీ అమ్మా నాన్నలను చంపేస్తానని బెదిరించాడు. తనతో రావాలని భయపెట్టి మోటార్ సైకిల్ ఎక్కించుకుని భాకరాపేట సమీపంలోని వేంకటేశ్వర స్వామి గుడికి తీసుకువెళ్లాడు. ఆ గుడిలో బలవంతంగా పెళ్లి చేసుకున్నారు. భాకరాపేటలో గది అద్దెకు తీసుకుని అందులో బాలికను ఉంచి బలవంతంగా పలుమార్లు లైగింక దాడికి పాల్పడ్డాడు. అప్పటికే బాలిక తల్లిదండ్రులు వెదురుకుప్పం పోలీసులను ఆశ్రయించడంతో 2021 మార్చి 23వ తేదీన ముద్దాయి నుంచి బాలికను రక్షించారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెదురుకుప్పం పోలీసులు కేసు నమోదుచేసి చిత్తూరు డీఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేశారు. చిత్తూరు పోక్సో కోర్టులో చార్జిషీటు దాఖలుచేశారు. ఈ కేసులో విచారణ పూర్తయి ముద్దాయి మణికి గరిష్టంగా 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.4,500 జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి శంకర్‌రావు తీర్పునిచ్చారు. ప్రభుత్వం తరఫున బాధితురాలికి రూ.ఒక లక్ష చెల్లించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.


