ఎట్టెట్టా?
కుంకీల కథ ముగియడంతో తెరపైకి మరో ప్లాన్!
కౌండిన్యలోని ఏనుగుల మెడకు త్వరలో జీపీఎస్ ట్యాగ్‌లు
జగరాజుల రాకపై ప్రజల మొబైళ్లకు అలెర్ట్ ఎస్‌ఎంఎస్‌లు
వాటి సిగ్నల్స్ ద్వారా ఎప్పటికప్పుడు లొకేషన్ ట్రాకింగ్
పలమనేరు: జిల్లాలో కుంకీ ఏనుగుల కథ అటకెక్కింది. కుంకీల సంరక్షణ ప్రభుత్వానికి పెను భారంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు టెక్నాలజీ ద్వారా ఏనుగుల మెడకు జీపీఆర్‌ఎస్ ట్రాకర్స్‌ను అమర్చనున్నట్టు తెలిపింది. ఇది ఎంతమేరకు సాధ్యమవుతుందో త్వరలో తేలనుంది.
ముందస్తు వర్ష సూచనలాగే..
వాతావరణ శాఖ నుంచి మొబైళ్లకు అలెర్ట్ మెసేజీలు వస్తుంటాయి. ఇదే విధంగా ఏనుగుల కదలికల ద్వారా అవి ఏమార్గంలో సంచరిస్తున్నాయే ట్రాక్ ద్వారా పసిగట్టి ఏ గ్రామం వైపు వెళుతున్నాయో ఆ గ్రామస్తుల ఫోన్లకు సందేశాలు పంపేలా అటవీశాఖ ప్లాన్ చేస్తోంది.
కాలర్లకు కట్టడం కష్టమే
ఇంతకీ అటవీశాఖ భావిస్తున్నట్టు ఏనుగుల మెడకు జీపీఆర్‌ఆర్ కాలర్లని అమర్చడం అంత సులభం కాదనే మాట వినిపిస్తోంది. గుంపులోని ఏనుగులను నిలువరించడం ఇక్కడున్న కుంకీల నుంచే సాధ్యం కాదని తేలిపోయింది. మరోవైపు మదపుటేనుగులు జోలికెళ్లే కుంకీలను సైతం ఇవి ఎదిరించి దాడులు చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏనుగుల మెడకు జీపీఆర్ టాగ్‌ను ఎలా వేస్తారనేది వెయ్యి డాలర్ల ప్రశ్నగా మారింది.
ఏనుగు మెడకు జీపీఆర్‌ఎస్ ట్యాగ్!
ప్రస్తుతం పలమనేరు ప్రాంతంలో 14, తమిళనాడు సరిహద్దు అడవుల్లో ఆరు, సోమల ప్రాంతంలో మూడు, గుడిపాల వద్ద రెండు ఏనుగులతోపాటు నాలుగు ఒంటరి ఏనుగులు సంచరిస్తున్నాయి. గుంపులోని ఏనుగుల కంటే ఒంటరిగా సంచరిస్తున్న మదపుటేనుల కారణంగానే ఎక్కువగా ప్రజలపై దాడులు, పంటలకు నష్టం జరుగుతోంది. వీటిని అదుపులోకి తీసుకురావడం కుంకీ ఏనుగులతో కాదని ఇప్పటికే ఫారెస్ట్ అధికారులకు తెలిసిపోయింది. దీంతో సాంకేతికంగా కొత్త మార్గంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఏనుగుల గుంపులో ఓ ఏనుగు మెడకు రెండేళ్ల బ్యాటరీతో పనిచేసే జీపీఆర్‌ఎస్ ట్రాకర్‌ను తగిలించి.. దాని సంచారం ద్వారా ఏనుగుల గుంపు ప్రాంతాన్ని లొకేషన్ ద్వారా చూస్తూ ఆ ప్రాంతానికి సమీపంలోని రైతులు, ప్రజల మొబైళ్లకు సందేశాలను పంపేలా ప్లాన్ చేస్తున్నట్టు ఇక్కడి ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.
ఎట్టెట్టా?


