కనతలలో అక్రమ క్వారీ
బంగారుపాళ్యం కనతల చెరువు వద్ద నిర్వహణ
పర్యావరణ అనుమతులు, రెన్యువల్లేవ్
అక్రమ తవ్వకాల్లో విజయం..
తమిళనాడుకు అడ్డదారిలో తరలింపు
లైట్ తీసుకుంటున్న మైనింగ్ అధికారులు
సాక్షి టాస్క్‌ఫోర్స్: బంగారుపాళ్యం కనతల చెరువు వద్ద అక్రమ క్వారీ యథేచ్ఛగా కొనసాగుతోంది. పర్యావరణ అనుమతులు, రెన్యూవల్ లేకుండా నల్లబంగారం మాయమవుతోంది. టీడీపీలోని ఇద్దరు బడా నేతల చేతిలో క్వారీ నడుస్తోంది. ఆ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఖనిజాన్ని కొల్లగొడుతున్నారు. ఆ ప్రాంతం సరిహద్దు కావడంలో చిటికెలో గ్రానైట్‌ను తమిళనాడుకు తరలించి జేబులు నింపుకుంటున్నారు. ఈ విషయాలు తెలిసినా సంబంధిత మైనింగ్ శాఖ అధికారులు లైట్ తీసుకుంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు.
పాత పత్రాలతో...కోట్లా వ్యాపారం!
ఈ క్వారీకి సంబంధించి గతేడాది రెన్యూవల్ ప్రక్రియ ఆగిపోయింది. ఇదే అదునుగా భావించి టీడీపీ నేతలు రెచ్చిపోయారు. అధికార బలాన్ని ఉపయోగించి కార్వీని వశం చేసుకున్నారు. ఎగువ కనతల నుంచి తమిళనాడుకు సరిహద్దు దాటిస్తున్నారు. రెండు రోజులకు ఒకసారి రూ.10 లక్షల నుంచి రూ.20లక్షల విలువ చేసే గ్రానైట్ దిమ్మెలు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరైనా అడిగితే... పాత పత్రాలను చూపించి క్వారీలో దర్జాగా తవ్వకాలు చేసుకుంటున్నారు. గట్టిగా ప్రశ్నించే వారిపై ఆ బడానేత ఎదురుతిరుగుతున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు.
లైట్ తీసుకో!
అక్రమ క్వారీ నిర్వహణకు సంబంధించి ముందస్తుగానే ఽఅధికారులు, బడా నేతకు ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం అక్రమ క్వారీని ఇన్నాళ్లు దర్జాగా నడిపిస్తున్నారు. పర్యావరణ అనుమతులు, రెన్యూవల్ విషయాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. సిబ్బంది, టీడీపీలోని ఓ నేత మైనింగ్ అధికారులకు అక్రమ విషయంపై ఫిర్యాదు చేస్తే లైట్ తీసుకోడంటూ.. బుజ్జగించి పంపించారు. వారు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు అధిష్టానానికి లేఖ పంపారు. ఓ బడా నేత కనుసన్నల్లో జరిగే ఈ అక్రమ తవ్వకాలతో తాము చాలా ఇబ్బంది పడుతున్నామని, ప్రభుత్వ ఆదాయానికి కూడా గండిపడుతోందని ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పట్టించుకోని పక్షంలో ధర్నాకు దిగుతామని వారు హెచ్చరించినట్టు సమాచారం.
అసలేం జరుగుతోందంటే!
బంగారుపాళ్యం మండలం, ఎగువ కనతల చెరువు వద్ద విలువైన క్వారీ ఉంది. ఇది నల్ల బంగారం. తమిళనాడు, కర్ణాటకలో ఈ ఖనిజానికి మంచి డిమాండ్ ఉంది. అయితే ఏడాది క్రితమే ఈ క్వారీ రెన్యూవల్‌కు వచ్చింది. అధికారం ఉందని.. అవేవీ పట్టించుకోకుండానే టీడీపీకి చెందిన ఇద్దరు నేతలు చేతులు కలిపారు. మండలంలోని ఓ బడానేతతో.. చిత్తూరుకు చెందిన మరో నేత క్వారీపై కన్ను వేశాడు. కొండను పిండేసేందుకు వెంటనే బండ్లను దింపారు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో ఎదురుతిరిగారు. ఇంతలో మండలంలోని ఆ బడానేత రంగంలోకి దిగారు. గ్రామస్తులను బెదిరించి నోరు మూయించారు.


