ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ
పుంగనూరు: మండలంలోని మార్లపల్లె సమీపంలోని జగనన్న కాలనీలో నివాసం ఉన్న అంకాయమ్మ ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. కూలి పనులకు వెళ్లిన అంకాయమ్మ ఇంటికి తిరిగి వచ్చే సరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో బంగారు నగలు, లక్ష రూపాయల నగదు, ఇతర వస్తువులు దొంగలించుకెళ్లారు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్ కిందపడి
మహిళ మృతి
గంగాధర నెల్లూరు: కూలి పనికి వెళ్లిన తన భర్తకు భోజనం అందించి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మహిళ మృతి చెందిన ఘటన గంగాధరనెల్లూరు మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు వివరాలు.. గంగాధరనెల్లూరు దళితవాడకు చెందిన మూర్తి నీవా నది సమీపంలో కూలి పనులు చేసేవారు. బుధవారం కూలి పనులకు వెళ్లిన తన భర్తకు మూర్తి భార్య నాగమ్మ అలియాస్ శ్రీదేవి (45) భోజనం తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి తీవ్ర గాయాలపాలైంది. స్థానికుల సహకారంతో 108 అంబులెన్స్‌లో చిత్తూరు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
వేర్వేరు ప్రమాదాల్లో
ఒకరి మృతి
మరొకరి పరిస్థితి విషమం
శాంతిపురం: పలమనేరు జాతీయ రహదారిపై మండల పరిధిలో బుధవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో వి.కోట మండలానికి చెందిన ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మఠం వద్ద ముందు వెళ్తున్న బైకును వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొంది. బైకుపై వెళ్తున్న వి.కోట మండలం, దాసార్లపల్లికి చెందిన చంద్రకాంత్(31) తలకు తీవ్ర గాయామై అక్కడికక్కడే మృతి చెందాడు. మండలంలోని రాళ్లబూదుగూరులో కార్పెంటర్ షాపు నిర్వహిస్తున్న చంద్రకాంత్ రోజూ బైకుపై రాకపోకలు సాగిస్తూ ప్రమాదం బారిన పడ్డాడు. మరో ప్రమాదంలో గుండిశెట్టిపల్లి వద్ద కారును బైకు ఢీకున్న ఘటనలో వి.కోట మండలం, నాగిరెడ్డిపల్లికి చెందిన మంజునాథ్(32) తీవ్రంగా గాయపడ్డాడు. సోమాపురంలో బంధువుల ఇంటికి వెళ్తూ మార్గమధ్యంలో ప్రమాదానికి గురయ్యాడు. స్థానికులు తనను 108 ద్వారా కుప్పం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. తలకు తీవ్ర గాయామైంది. పరిస్థితి విషమంగానే ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఇంటి తాళాలు పగులగొట్టి చోరీ


