టిడ్కో లబ్ధిదారులపై వేధింపులు తగవు
చిత్తూరు కార్పొరేషన్: టిడ్కో ఇళ్ల లబ్ధిదారులపై బ్యాంకు అధికారుల వేధింపులు తగవని సీపీఐ జిల్లా కార్యదర్శి నాగరాజు స్పష్టం చేశారు. మంగళవారం సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గతంలో టీడీపీ ప్రభుత్వం లబ్ధిదారుల వద్ద డిపాజిట్ తీసుకొని ఇప్పటికీ ఇళ్లు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. అధికారంలో వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా కూటమి ప్రభుత్వం టిడ్కో బాధితులకు న్యాయం చేయలేదని ఆరోపించారు. మరో వైపు బ్యాంక్ అధికారులు మాత్రం లబ్ధిదారులను డబ్బులు చెల్లించాలని నోటీసులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గృహాలు ఇచ్చాక రుణాలు కట్టకపోతే నోటీసులు ఇవ్వాలే గానీ ముందే ఇవ్వడం దారుణమన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించి టిడ్కో గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో గోపీనాథ్, మణి, చంద్ర విజయ గౌరీ జమీలాబి, కుమారి పాల్గొన్నారు.


