కరిగిపోతున్న గుట్టపై విచారణ
రొంపిచెర్ల: చిత్తూరు–అన్నమ్మయ్య జిల్లా సరిహద్దులో అనుమతులు లేకుండా గుట్టను కిరిగిస్తున్నారని సాక్షి దిన పత్రికలో సోమవారం వచ్చిన వార్తకు రెండు జిల్లాల మైనింగ్ అధికారులు స్పందించారు. ఈ మేరకు దాడులు నిర్వహించారు. చిత్తూరు జిల్లా మైనింగ్ ఏడీ సత్యనారాయణ కథనం. అన్నమ్మయ్య జిల్లా, పీలేరు మండలం, గూడరేవుపల్లె, చిత్తూ రు జిల్లా, రొంపిచెర్ల మండలం, చిచ్చిలివారిపల్లె గ్రామ సరహద్దులో ఉన్న గుట్టను పరిశీలించినట్టు తెలిపారు. తనిఖీలో పీలేరు మండలం, సూరవ్వచెరువుకు ఉత్తరం వైపున పెద్ద గుంత ఉండడంతో పరిశీలించామన్నారు. అక్కడ కూలీలు రాళ్లు కొడుతున్న వారిని బయటకు పంపిచామని చెప్పారు. రాక్ మార్క్ ప్రకారం పీలేరు మండలం, గూడరేవుపల్లె గ్రామం సర్వే నం.429లో ఉన్నట్లు గుర్తించామన్నారు. గుంతను కొలవగా సుమారు 15,000 స్క్వేర్ మీటర్లు, 6 నుంచి 10 మీటర్ల ఎత్తు ఉన్నట్లు గుర్తించి వాటి పరిమాణం గుర్తించేందుకు వివరణాత్మక సర్వే చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. అన్నమ్మయ్య జిల్లా మైనింగ్ అధికారులు రికార్డులు పరిశీలించగా పీలేరు మండలం, గూడరేవుపల్లె గ్రామం సర్వే నం.429లో 1.998 హెక్టార్లలో రోడ్డు మెటల్, బిల్డింగ్ స్టోన్ ఖనిజానికి సి.రజిత అనే మహిళకు 2022 డిసెంబరు 29 నుంచి 2032 డిసెంబరు 28వ తేదీ వరకు లీజుకు ఇచ్చినట్టు ఉందన్నారు. సదురు స్టోన్ క్రషర్‌కు సమీపంలో అక్రమ తవ్వకాలు జరిగిన గుంత ఉండగా అక్కడే ఉన్న కూలీలను విచారించామని తెలిపారు. అయితే కూలీలు ఈ రాయి సమీపంలోని క్రషర్‌కు రవాణా అవుతోందని ఒప్పుకోవడం జరిగిందన్నారు. లీజుదారు రజిత భర్త కిషోర్‌కుమార్‌రెడ్డిని కూడా విచారించగా గుంత లీజు పరిధిలోకి రాదన్నారు. దీంతో పనులు నిలిపి వేయాలని ఆదేశించామన్నారు. అలాగే స్టోన్ కషర్ వద్ద 600 క్యూబిక్ మీటర్ల కంకర నిల్వ ఉన్నట్లు గుర్తించామని, 90 శాతం పనులు పీలేరు మండల పరిధిలోనే జరిగాయని, రొంపిచెర్ల మండల పరిధిలో 10 శాతం పనులు గతంలో జరిగినట్లు గుర్తించామని తెలిపారు. భైరవ స్టోన్ క్రషర్ పేరుతో 2008 నుంచి 2018 వరకు ఉందన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్టోన్ క్రషర్‌పై చర్యలు తీసుకుంటామని ఏడీ తెలిపారు.
కరిగిపోతున్న గుట్టపై విచారణ
కరిగిపోతున్న గుట్టపై విచారణ


