‘పచ్చ’ లాటరీపై రంగంలోకి ఎస్పీ!
చిత్తూరు అర్బన్: పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు రోజువారీ కూలి పనులు చేసే ప్రజలే లక్ష్యంగా చిత్తూరులో జరుగు తున్న నిషేధిత లాటరీ ముద్రణ, విక్రయాలపై ఉక్కుపాదం మోపడానికి స్వయంగా ఎస్పీనే రంగంలోకి దిగారు. చిత్తూరులో జరుగుతున్న ఈ సామాజిక అసమాన క్రీడపై ‘సాక్షి’ పత్రికలో మంగళవారం ‘పచ్చ లాటరీ’ శీర్షికన వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. చిత్తూరులో ప్రారంభమయ్యే లాటరీ జిల్లాలోని పలు ప్రాంతాలకు ఎగుమతి అవుతుండడంతో పాటు విజయవాడకు కూడా వెళుతుండడం, చిత్తూరులోని కొందరు ఖాకీలు దీనికి కొమ్ముకాయడంపై ‘సాక్షి’లో వచ్చిన వార్తపై ఎస్పీ డూడీ స్పందించారు. ఎవరు దీన్ని పెంచి పోషిస్తున్నారు..? ఎవరెవరికి మామూళ్లు వెళుతున్నాయి..? అక్రమార్కులకు ఎవరు అండగా నిలుస్తున్నారు..? ఇందులో కింగ్‌పిన్ ఎవరు..? అనే వివరాలను ఆయన రాబడుతున్నారు. పోలీసు శాఖలో తనకు నమ్మకంగా ఉంటున్న వాళ్ల నుంచి నివేదిక నేరుగా తన టేబుల్‌పైకే తెప్పించుకుంటున్నారు. జిల్లాలో లాటరీ విక్రయాలు పూర్తిగా నిరోధించడానికి ఏం చేయాలనే దానిపై కసరత్తు ప్రారంభించారు. ఫలితంగా లాటరీకి దన్నుగా ఉంటున్న వ్యక్తులతో పాటు కొందరు ఖాకీల గుండెల్లో రైళ్లు పడుగెడుతున్నాయి. ఎవరిపై వేటు పడుతుందో తెలియక మదనపడుతున్నారు.
హైవేల అనుసంధానానికి గ్రీన్‌సిగ్నల్
చితూరు అర్బన్: జిల్లాలో జాతీయ రహదారుల అనుసంధానానికి కేంద్రం సానుకూలంగా స్పందించిందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు. కుప్పం–హోసూరు, బెంగళూరు గ్రీన్‌ఫీల్డ్ హైవే–కాణిపాకం ఆలయ లింకు రోడ్డు (ఎన్‌హెచ్–140) మధ్య కనెక్టివిటీకి తాను ఇచ్చిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కొలిక్కి వచ్చిందని, ఈనెల 15న పనుల కేటాయింపు జరుగుతుందన్నారు.
‘పచ్చ’ లాటరీపై రంగంలోకి ఎస్పీ!


