ఏదీ.. ఆపన్న హస్తం?
వీధిన పడుతున్న రోడ్డు ప్రమాద బాధితులు
● సాయం అందించడంలో బాబు ప్రభుత్వ నిర్లక్ష్యం ● మాజీ డెప్యూటీ సీఎం ధ్వజం
వెదురుకుప్పం: ‘రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్న కుటుంబాలకు ఆపన్నహస్తం అందించడంలేదు. వారి కుటుంబాలు వీధినపడుతున్నాయి..’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకులైన పేద ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా వారి కుటంబాలకు బీమా ప్రీమియం గానీ, ఎలాంటి ఆర్థిక సాయం గానీ చెల్లించకపోవడంపై దారుణమన్నారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ హాయంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే స్పందించి ప్రమాదం జరిగిన వెంటనే బాధిత కుటుంబానికి రూ. 5 లక్షలు చెల్లించేవారని గుర్తుచేశారు. ఇప్పుడు బాబు ప్రభుత్వం ఆయా బాధితులకు ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడంతో దిక్కుతోచడం లేదన్నారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో ఇటీవల కా లంలో సుమారు 14 మంది వివిధ రోడ్డు ప్రమాదా ల్లో ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. వారికి నేటికీ ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సాయం అందించలేదన్నారు. ఆర్టీసీ బస్సులు ఢీకొని ప్రాణాలు కోల్పోయిన వారికి సైతం ఎలాంటి సాయం అందలేదన్నారు. రైతన్నా మీకోసం కార్యక్రమం ద్వారా రైతులకు ఏం ఒరిగిందో చెప్పాలన్నారు.


