సమస్యల గోడు.. పట్టేదెవరికి?
చిత్తూరు కలెక్టరేట్/చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా....సమస్యల ను పూర్తి స్థాయిలో పరిష్కరించాలన్నా ప్రజాప్రతినిధులు....అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిందే. శనివారం చిత్తూరు జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరు కానున్నారు. ప్రతిసారి కొన్ని ప్రభుత్వ శాఖలకే పరిమితమైపోతున్న సర్వసభ్య సమావేశం.....ఈసారైనా ప్రజా సమస్యలకు ప్రాధాన్యమివ్వాలని జిల్లా వాసులు కోరు తున్నారు. అన్ని కీలక ప్రభుత్వ శాఖలపై చర్చ నిర్వహించాలని విన్నవిస్తున్నారు.
ఏనుగుల దాడి ఆపలేక..
జిల్లాలో ఏనుగులదాడి నివారణ అసాధ్యంగా మారింది. సరిహద్దు రాష్ట్రాల ప్రాంతం కావడంతో ఏనుగుల రాకను నివారించలేకపోతున్నారు. కనీసం పొలాలు, సమీప గ్రామాల ప్రజలపై రాకుండా అడ్డుకట్ట వేయ లేకపోతున్నారు. కుంకీలంటూ ప్రచారం చేసిన క్షేత్రస్థాయిలో వాటి పనితీరు సరిపోవడం లేదు.
వెలగని సోలార్
జిల్లాలో పీఎం సూర్యఘర్ ద్వారా రాయితీ సోలార్ ప థకం వెలగడం లేదు. 3 వేల సర్వీసులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఈ ఆర్థిక సంవత్సరంలో 500 కూడా ఇవ్వలేకపోతున్నారు.వ్యవసాయ సర్వీసుల కో సం నెలల తరబడి అన్నదాతలు 2వేల మంది వేచి చూస్తున్నారు.
పేరుకుపోయిన బిల్లులు
జిల్లాలో ఆర్‌అండ్‌బీ పరిధిలో ఏడాదిన్నర కాలంలో మరమ్మతు, ప్రత్యేక మరమ్మతు, విస్తరణ పనుల కింద మొత్తం రూ.150 కోట్ల పైగా మొత్తంతో పనులు వివిధ దశల్లో జరుగుతున్నాయి. ఇందులో పలు పనుల అయిపోగా బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ఆర్‌అండ్‌బీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
గ్రంథాలయ సెస్ రూ.10.5 కోట్లు
జిల్లాలోని గ్రేడ్–1 లో 4, గ్రేడ్–2 లో 8, గ్రేడ్–3 లో 59 చొప్పున గ్రంథాలయాలు ఉన్నాయి. వీటికి స్థానిక సంస్థల నుంచి వసూలు చేసే సెస్‌తో నిర్వహణ చేస్తున్నారు. 116 మంది ఉద్యోగులకు గాను 46 మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఉన్నవారికి జీతాలు ఇవ్వడమే కష్టంగా మారింది. జిల్లాలో గ్రంథాయాలకు రావాల్సిన సెస్ రూ.10.05 కోట్లు వరకు రాలేదు.
గ్రీన్ అంబాసిడర్ల బాధలు పట్టవా..
ఉమ్మడి జిల్లాలో 1411 పంచాయతీల్లో 2697 మంది గ్రీన్‌అంబాసిడర్లు పని ఒత్తిడి, రాజకీయ జోక్యం పెరగడంతో జిల్లాలో 720 మంది విధులు వదులుకో గా ప్రస్తుతం 1977 మంది పనిచేస్తున్నారు. వారికి రూ.65 లక్షలకు పైగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి.


