జిల్లాలో తాజాగా 5 స్క్రబ్ టైఫస్ కేసులు
ఆస్పత్రులకు ఆదేశం
చిత్తూరు రూరల్ (కాణిపాకం)/సదుం : జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు విరుచుకుపడుతున్నాయి. మళ్లీ కేసులు వెలుగుచూశాయి. చిత్తూరు నగరంలోని మురకంబట్టు, కట్టమంచిలో మూడు, జీడీ నెల్లూరు, సదుం మండలంలోని అమ్మగారిపల్లె పంచాయతీ పరిధిలో కేసులు నమోదయ్యాయి. బాధితులు ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండ గా మరో ఇద్దరు మాత్రం ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. కట్టమంచిలో నమోదైన కేసుకు మాత్రం ఎలాంటి తీవ్రత లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. సదుం మండలం అమ్మ గారిపల్లె పంచాయతీ పరిధి లో వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పించామని చెరుకువారిపల్లె పీహెచ్‌సీ డాక్టరు చరణ్ తెలిపారు. రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి విద్యాసాగర్, సిబ్బంది నీలకంఠ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు జానకి, పంచాయతీ కార్యదర్శి చలపతి పాల్గొన్నారు.
గోప్యంగా ఉంచాలని మౌఖిక ఆదేశాలు
ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చే స్క్రబ్ టైఫస్ కేసులను గోప్యంగా ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని అధికారులు ప్రైవేటు ఆస్పత్రులకు ఆదేశాలిచ్చారు. మీడియాకు సమాచారం ఇవ్వొద్దని సూచించారు. కేసుల నమోదుతో ఉన్నతాధికారులు, రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి ఇబ్బంది పడాల్సి వస్తోందని వారు ప్రైవేటు ఆస్పత్రులకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులు స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులను బయటకు చెప్పాలంటే భయపడుతున్నాయి.


