● పూర్తి స్థాయిలో హాజరుకాని సచివాలయ ఉద్యోగులు ● సమయపాలన
సేవలు నిల్..
సర్వేలు ఫుల్
నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు..
తప్పని పడిగాపులు
పలమనేరు : మండలంలోని మండిపేటకోటూరు సచివాలయం వద్ద రెండు రోజుల కిందట పింఛన్ల కోసం వచ్చిన వృద్ధులు సిబ్బంది లేక ముసురు వర్షంలో పడిగాపులు పడాల్సి వచ్చింది. మంగళవారం ఉదయం నుంచి 11 గంటలు దాకా పింఛనుదారులు నిరీక్షించినా సచివాలయ సిబ్బంది విధులకు రాలేదు. వారి గురించి కొందరు యువకులు అధికారులకు తెలిపారు. ఆపై స్పందించిన ఎంపీడీవో భాస్కర్ సంబంధిత పంచాయతీ కార్యదర్శిని అప్రమత్తం చేయించి పింఛన్లు పంపిణీ చేయించారు.
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో రూరల్‌లోని మండలాల్లో 612 గ్రామ సచివాలయాలు ఉండగా అందులో 4,477 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో పూర్తి స్థాయిలో ఉద్యోగులు హాజరైన దాఖలాలు లేవు. వారి కోసం ఎవరైనా అడిగితే ఇప్పుడే ఫీల్డ్‌కు వెళ్లారని చెబుతున్నారు. ఇదంతా చంద్రబాబు ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులపై కక్ష సాధింపులతో సర్వేల బాధ్యతలు అప్పగించడం వల్లేనని ప్రజలు పెదవి విరుస్తున్నారు.
సమావేశాల పేరుతో గైర్హాజరు
జిల్లాలోని సచివాలయాల పరిధిలో 463 మంది వీఆర్‌వోలు పనిచేస్తున్నారు. వీరిలో అనేక మంది సమావేశాల పేరుతో సాకులు చెప్పి విధులకు గైర్హాజరవుతున్నారు. కొంత మంది వీఆర్‌వోలు మండల కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. చిత్తూరు, పలమనేరు, పూతలపట్టు, కుప్పం, జీడీ నెల్లూరు నియోజకవర్గాల్లోని వీఆర్‌వోలు ఉదయం 11.30 గంటలకు విధులకు హాజరవుతున్నారు. ప్రతి సచివాలయానికి ఉదయం 10 గంటలకు హాజరు కావాల్సిన వీఆర్‌వోలు డైరెక్టుగా మండల కార్యాలయానికి వెళ్తున్నారు. ప్రజలు ఫోన్ చేస్తే సమావేశాలున్నాయని ఏమారుస్తున్నారు. కనీసం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయినా సచివాలయాల్లో ఉద్యోగులు అందుబాటులో ఉండటం లేదు.
రీ సర్వేలతో సర్వేయర్లు సతమతం
ప్రతి గ్రామంలో సర్వే సమస్యలు పరిష్కరించేందుకు గత ప్రభుత్వం 398 మంది సర్వేయర్లను ఏర్పాటు చేసింది. వీరు రీ సర్వే నిర్వహిస్తుండటంతో వారు ఎక్కడి నుంచైనా బయోమెట్రిక్ వేసే అవకాశం కల్పించారు.దీంతో అందుబాటులో ఉండడం లేదు. ఇక విద్యుత్ సమస్యలు పరిష్కరించేందుకు 443 మంది ఎనర్జీ అసిస్టెంట్‌లు ఉండేవారు. వారిని విద్యుత్ శాఖ అధికారులు డిప్యూటేషన్లకు వినియోగిస్తుండటంతో ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. దీంతోపాటు మున్సిపాలిటీల పరిధిలో గేటు వసూళ్ల పనులు అప్పగించారు. ఎన్నికల విధుల్లో బీఎల్‌వోలుగా నియమించారు.
సర్వేలతో సిబ్బంది సతమతం
చంద్రబాబు పాలనలో వివిధ సర్వేల పేరుతో ఇప్పటి వరకు జిల్లాలోని సచివాలయ ఉద్యోగుల వందల సంఖ్యలో సర్వేలు నిర్వహించారు. అందులో ఈకేవైసీ అప్‌డేట్, కౌశలం (వర్క్‌ఫ్రంహోం), కొత్త రేషన్‌కార్డుల ఈకేవైసీ, వాట్సాప్ గవర్నెన్స్ డోర్ టు డోర్ అవేర్‌నెస్, బయోమెట్రిక్ అప్‌డేట్, పురమిత్ర, పీ4 దత్తత కార్యక్రమం, పట్టదారు పాసుపుస్తకం సర్వే, చిల్డ్రన్ విత్ ఆధార్ ఐడెంటిటీ, హౌస్ హోల్డ్ వివరాల ఎడిట్, యోగా డైలీ అటెండెన్స్, జీఎస్టీ అవగాహన కార్యక్రమాలు, బడి బయటి పిల్లల గుర్తింపు, లీప్ యాప్ అసెస్‌మెంట్, తల్లికి వందనం సర్వే, జ్ణానభూమి వెరిఫికేషన్, ఆటోడ్రైవర్‌ల సర్వే ఇలా అనేక సర్వేలతో సచివాలయ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
189కొత్తపల్లె సచివాలయంలో ఖాళీ
గుడిపాల: గుడిపాల మండలం 189 కొత్తపల్లె గ్రామ సచివాలయాన్ని బుధవారం సాక్షి పరిశీలించగా సిరికల్చర్ అసిస్టెంట్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. మిగతా పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్, ఎఎన్‌ఎమ్, వెల్పేర్ అసిస్టెంట్ ఏ ఒక్కరూ కూడా కార్యాలయంలో లేదు. సర్వే డూటీలు ఉన్నాయని అందరూ డుమ్మా కొట్టారు. దీంతో ప్రజలు వచ్చి వెనుదిరుగుతున్నారు.
పుంగనూరు : సచివాలయ కార్యదర్శులు అందరూ ఫీల్డ్‌కు వెళ్లారు. మీరు ఎవరు. ఎవరికీ సమాధారం చెప్పాల్సిన అవసరం నాకు లేదు.పై అధికారులు అడిగితే చెబుతా... అంటూ మున్సిపాలిటీలోని బీడీ కాలనీ 1వ సచివాలయం అడ్మిన్ దామోదరం ఓవర్ యాక్షన్ చేస్తూ నిర్లక్ష్యంగా మాట్లాడిన సంఘటన బుధవారం జరిగింది. ఆ ప్రాంత ప్రజలు బీడీ కాలనీ సచివాలయ ఉద్యోగులు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని, సమస్యలు పట్టించుకోవడం లేదని , ఎప్పుడు వెళ్లిన కార్యాలయంలో అందుబాటులో ఉండరంటూ ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపై గత నెల 27న జరిగిన మున్సిపల్ సమావేశంలో చైర్మన్ అలీమ్‌బాషా సమావేశంలో సచివాలయ కార్యదర్శుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ కార్యదర్శులు , ప్రజలతో నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని, సమస్యలు పరిష్కరించడం లేదని ఆరోపించారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కమిషనర్ మధుసూదన్‌రెడ్డిని ఆదేశించారు. ఈ విషయాలపై పరిశీలనకు వెళ్లిన సాక్షి విలేకరితో దామోదరం దురుసుగా మాట్లాడి, తమను ఎవరు ఏమి చేయలేరని దురుసుగా మాట్లాడారు. ఈ విషయమై కమిషనర్ మధుసూదన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన విచారణ జరిపి, విధులకు హాజరుకాని కార్యదర్శులపైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
డిప్యూటేషన్‌లో ఉద్యోగులు
జిల్లా వ్యాప్తంగా ఉన్న 612 గ్రామ, వార్డు సచివాలయాల్లో 4,477 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 4040 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 437 మంది విధులకు గైర్హాజరవుతున్నారు.
● పూర్తి స్థాయిలో హాజరుకాని సచివాలయ ఉద్యోగులు ● సమయపాలన


