ఫుట్‌ఓవర్ బ్రిడ్జి కోసం కేంద్ర మంత్రికి ఎంపీ వినతి
● మాజీ మంత్రి ఆర్కే రోజా చొరవ ● పుత్తూరు ప్రజల కల సాకారం
పుత్తూరు : పుత్తూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుతూ తిరుపతి ఎంపీ గురుమూర్తి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు వినతిపత్రం అందజేశారు. బుధవారం ఢిల్లీలోని కేంద్ర మంత్రి కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు, రైల్వే స్టాండింగ్ కమిటీ మెంబర్ మేడా రఘునాథ రెడ్డితో పాటు ఎంపీ గురుమూర్తి మంత్రిని కలిశారు. తన పార్లమెంటు నియోజకవర్గంలోని పుత్తూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి ఆర్కే రోజా గతంలోనూ ఇదే విషయాన్ని ఆమె మంత్రి హోదాలో అభ్యర్థించినట్లు గుర్తు చేశారు. పుత్తూరు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని, 3 నెలల వ్యవధిలో 13 మంది మృత్యువాత పడడం ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఆవశ్యకతను తెలియజేస్తోందని వివరించారు. కొన్ని దశాబ్దాలుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు పెండింగ్‌లోనే ఉందని, ఇకనైనా పరిష్కరించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని హామీ ఇచ్చినట్లు ఎంపీ గురుమూర్తి వెల్లడించారు. దీంతో పుత్తూరు ప్రజల కల సాకారం కానుంది.
మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించాలి
చిత్తూరు కలెక్టరేట్ : మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని డీఆర్‌వో మోహన్‌కుమార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ భవనంలో జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రాఘవుల ఆధ్వర్యంలో స్పర్శ్ కార్యక్రమం నిర్వహించారు. సిస్టం ఫర్ అడ్మినిస్ట్రేషన్–రక్ష (స్పర్శ్) కార్యక్రమం మాజీ సైనికులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆధునిక డిజిటల్ ప్లాట్‌ఫాంతో మాజీ సైనికుల పెన్షన్ సేవలు వేగవంతంగా అందిస్తామన్నారు. మాజీ సైనికులకు సులభతరంగా సేవలందించేందుకు స్పర్శ్ కార్యక్రమం నెలకొల్పారన్నారు. మాజీ సైనికుల పెన్షన్ సమస్యలను ఎప్పటికప్పుడు నేరుగా అధికారుల సమక్షంలో పరిష్కరిస్తారన్నారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ సీనియర్ ఆడిట్ ఆఫీసర్ కేవీ రమణ, ఆడిట్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీరామమూర్తి, అసిస్టెంట్ డైరెక్టర్ సత్యప్రసాద్, జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రాఘవులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫుట్‌ఓవర్ బ్రిడ్జి కోసం కేంద్ర మంత్రికి ఎంపీ వినతి


