సవాల్ విసిరారు..వెన్ను చూపారు !
పలమనేరు : ‘తనపై టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలు పచ్చి అబద్దమని శివుడి సాక్షిగా తాను ఎలాంటి అక్రమాలు చేయలేదంటూ పట్టణ వైఎస్సార్‌సీపీ కన్వీనర్ హేమంత్‌కుమార్‌రెడ్డి మంగళవారం శివాలయంలో దేవుడి ముందు ప్రమాణం చేశారు’. వైఎస్సార్‌సీపీ హయాంలో హేమంత్‌కుమార్‌రెడ్డి తన ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుక తోలించుకున్నాడంటూ పట్టణానికి చెందిన ఓ టీడీపీ నేత రెండు రోజుల క్రితం యూట్యూబ్‌లో కాణిపాకంలో ప్రమాణం చేస్తామని ఆరోపించారు. దీన్ని సవాల్‌గా తీసుకున్న ఆయన స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులతో కలసి కాణిపాకానికి రావాలని ఎదురుచూసినా ఎవరూ రాకపోవడంతో స్థానిక శివాలయంలో ప్రమాణం చేశారు. తనను ఆరోపించినవారు శివాలయానికై నా రావాలని అంతదాకా వేచి ఉంటానంటూ సవాల్ విసిరారు. కానీ టీడీపీ నేత రాకపోవడంతో ఆయన మాట్లాడుతూ తాను ఇంటి నిర్మాణానికి టీడీపీవారి వద్ద ఇసుక కొనుగోలు చేశానని వారు కూడా కావాలంటే వచ్చి చెబుతారన్నారు. ఇష్టాను సారంగా ఆరోపణలు చేయడం ఇకనైనా మానుకోవాలని ఆయన హితవు పలికారు.


