ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఎంపీకి వినతి
పుత్తూరు : రైల్వే ప్రమాదాలను నివారించడానికి స్థానిక ధర్మరాజుల గుడి ఎదురుగా గల రైల్వే ట్రాక్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి విత్ ర్యాంప్ నిర్మాణం చేపట్టాలని మాజీ మంత్రి ఆర్కే రోజా , తిరుపతి ఎంపీ గురుమూర్తికి విజ్ఙ ప్తి చేశారు. మంగళవారం ఎంపీని కలిసిన ఆమె 2023 ఆగస్టు 16వ తేదీన అప్పటి రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్‌ను అభ్యర్థించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ పనులు ఇంకా ప్రారంభం కాని నేపథ్యంలో గత మూడు నెలల వ్యవధిలో 13 మంది రైల్వే ట్రాక్ దాటుతూ మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పుత్తూరులో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, అందుకు సంబంధించిన మ్యాప్‌ను అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎంపీ గురు మూర్తి మాట్లాడుతూ.. పుత్తూరులో ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు విషయమై కేంద్ర ప్రభుత్వంపై పలుమార్లు చర్చించినట్లు తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభమయ్యేటట్లు తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు.


