బిల్లులు ఇప్పించు భీమేశ్వరా!
పూతలపట్టు (యాదమరి): మామిడి రైతులకు చంద్రబాబు ప్రభుత్వం హామీ మేరకు రూ.8 రూపాయల గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందేనని జిల్లా రైతు అధ్యక్ష, కార్యదర్శులు మునీశ్వర్‌రెడ్డి, మురళీ అన్నారు. మంగళవారం పూతలపట్టు మండల కేంద్రంలోని శివాలయం వద్ద మామిడి రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గుజ్జు పరిశ్రమలపై ప్రభుత్వం పర్యవేక్షణ లేకపోవడం దారుణమన్నారు. మామిడి పంటను పరిశ్రమలకు తరలించిన రైతులకు నెలలు గడుస్తున్నా ఇంత వరకు బకాయి బిల్లులు చెల్లించక ఆలస్యం చేయడం దుర్మార్గమన్నారు. మామిడికి గిట్టుబాటు ధర సాధన కోసం, మార్కెటింగ్ వ్యవస్థను గాడిలో పెట్టడానికి అవసరమైన డిమాండ్ల కోసం ఈ నెల ఆఖరున జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. అనంతరం భీమేశ్వర స్వామికి వినతి పత్రం అందజేశారు. కాగా సమావేశంలో మామిడి రైతుల సంఘం పూతలపట్టు మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
వడమాలపేట విద్యార్థినికి రజత పతకం
వడమాలపేట (పుత్తూరు): శ్రీసత్యసాయి జిల్లా చిగిచెర్లలో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్‌లో వడ మాలపేట జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని ప్రణతి జూడో పోటీలలో రజత పతకం సాధించింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ప్రణతి అండర్–14 కేటగిరిలో పతకం సాధించింది. విద్యార్థినిని పాఠశాల హెచ్‌ఎం కరుణా నవనీ తం, ఉపాధ్యాయ బృందం అభినందించింది.
రేపు అర్ధగిరి క్షేత్రంలో పౌర్ణమి వేడుకలు
తవణంపల్లె : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అర్ధగిరి శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానంలో 4వతేదీ గురువారం కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తామని ఆలయ ఇన్‌ఛార్జి ఈఓ మునిశేఖర్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు స్వామికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహిస్తామన్నారు. 11 గంటలకు స్వామికి సుదర్శన హోమం, ఉచిత ప్రసాదాలు పంపిణీ చేస్తామన్నారు. సాయంత్రం 7 గంటలకు ప్రాకారోత్సవం వైభవంగా జరుగుతుందని వివరించారు. ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.
సైన్స్ ఫెస్టివల్‌కు రమేష్ ఎంపిక
నగరి : ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (ఐఐఎస్‌ఎఫ్)కు నగరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ బి.రమేష్ ఎంపికయ్యారు. డిసెంబర్ 6 నుంచి 9 వరకు చండీఘర్ పంజాబ్ యూనివర్సిటీ నందు జరిగే సైన్స్ ఫెస్టివల్‌లో వినూత్న బోధన, విజ్ఞాన వ్యాప్తిని బలోపేతం చేయడానికి రూపొందించిన వివిధ విద్యా, నైపుణ్యాలను పెంచే సెషన్లలో రమేష్ పాల్గొనున్నారు. ఆ మేరకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్.వేణుగోపాల్, అధ్యాపకులు ఆయనకు అభినందనలు తెలిపారు.
నేడు విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని బీసీ భవన్‌లో బుధవారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా విభిన్నప్రతిభావంతుల శాఖ ఏడీ విక్రమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా స్థాయిలో అధికారికంగా విభిన్న ప్రతిభావంతుల వేడుకలు ఉదయం 10 గంటలకు నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని ప్రతిభావంతులు, విభిన్నప్రతిభావంతుల సంఘాల నాయకులు హాజరు కావాలని కోరారు.
బిల్లులు ఇప్పించు భీమేశ్వరా!


