ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సమరం
– రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి
నారాయణస్వామి
కార్వేటినగరం : రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి కార్యకర్తలు సిద్ధం కావాలని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. మంగళవారం పుత్తూరు పార్టీ కార్యాలయంలో జీడీ నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి ఆధ్వర్యంలో కోటి సంతకాల కరపత్రాలను డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. గత ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారం వచ్చాక వాటిని అమలు చేయకుండా దగా చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న దగాను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నారు. పేద ప్రజలకు వైద్య విద్యను అందించడానికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కళాశాలలను నిర్మాణం చేస్తే నేడు చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేసి తమకు అనుకూలమైన బినామీల చేతిలో పెట్టారని విమర్శించారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీ కరణను విరమించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని పిలుపునిచ్చారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతులతో పాటు అన్ని సామాజిక వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. జగనన్నను సీఎం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుదామని, కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు దైర్యంగా ఉండాలని అందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. కోటి సంతకాల కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని గుర్తు చేశారు. కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


