బాల్యవివాహాలతోనే హైరిస్క్ కేసులు
చౌడేపల్లె : బాల్య వివాహాల కారణంతోనే హైరిస్క్ కేసులు నమోదవుతున్నాయని జిల్లా గణాంక అధికారి డాక్టర్ జార్జి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని 29 ఏచింతమాకులపల్లె, కాగతి, గడ్డంవారిపల్లెలోని సీహెచ్‌సీ కేంద్రాలను తనిఖీ చేశారు. కేంద్రాల్లో నిర్వహించాల్సిన రికార్డులను పరిశీలించారు. 12 వారాల్లోపు గర్భిణులను ఆన్‌లైన్‌లో నమోదు చేయించి వారికి నిర్ణీత గడువులోపు టీకాలు వేయించాలని ఆరోగ్య సిబ్బందికి సూచనలిచ్చారు. జిల్లా వ్యాప్తంగా 15 నుంచి 19 ఏళ్లలోపు గల యువతులే త్వరగా వివాహాలు చేసుకొని గర్భం దాల్చడం వలన హైరిస్క్ కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. రక్తహీనత నుంచి విముక్తి పొందడానికి అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు నాణ్యమైన పౌష్టికాహారంను వినియోగించేలా చైతన్యం తీసుకురావాలని కోరారు. ఆరోగ్య పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్ మోనా, ఆరోగ్యశాఖ సిబ్బంది రామ్మోహన్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


